Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
బీఆర్ఎస్ ఎంపీల నిరంతర ఆందోళనతో గురువారం కూడా అదానీ అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు స్తంభించాయి. లోక్ సభ ప్రారంభం కాగానే ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాల్సిందేనని పట్టుపట్టి డిమాండ్ చేస్తూ ఎంపీలు చేసిన నినాదాలతో పార్లమెంట్ మార్మోగింది. దీంతో స్పీకర్ ఉభయ సభలను వాయిదా వేయగానే, ఎంపీలంతా నామ నాగేశ్వరరావు నాయకత్వంలో పార్లమెంటు ఒకటో నెంబర్ గేట్ వద్దకు చేరుకుని విపక్షాలతో కలసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని, ఆందోళన కొనసాగించారు. కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ అదానీ సంక్షోభం ఉభయ సభలనూ ఇన్ని రోజులుగా కుదిపేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి పట్టకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.అయినా సరే జెపిసి వేసేంతవరకు రెట్టింపు ఉత్సహాంతో ఆందోళన కొనసాగిస్తామని నామ స్పష్టం చేశారు. దేశ ప్రజలకు కావాల్సింది సభలు వాయిదా కాదని , అదానీ అంశంపై జేపీసీ సభల్లో చర్చ అని నామ పేర్కొన్నారు.
కొవ్వూరు రైల్వే లైన్ సంగతేమిటో తేల్చండి
దేశ వ్యాప్తంగా కొత్తగా ప్రతిపాదించిన, మంజూరు చేసిన కొత్త రైల్వే ప్రాజెక్టుల వివరాలను రాష్ట్రాల వారీగా తెలియజేయాలని లోక్ సభలో బీఆర్ఎన్ పార్టీ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు గురువారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా కోరారు. అదే విధంగా తెలంగాణలో భద్రాచలం రోడ్డు - సత్తుపల్లి రైల్వే మార్గానికి సంబంధించి ఇప్పటి వరకు సాధించిన పురోగతిని వివరించాలని కోరారు. ఈ రైలు మార్గానికి ఎన్ని నిధులు కేటాయించారో వెల్లడించాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు, భద్రాచలం పుణ్యక్షేత్రం, అంతర్గత గిరిజన ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించే ఈ రైలు మార్గాన్ని కొవ్వూరు వరకు పొడిగించే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలియజేయాలని నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఈ విషయమై కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇస్తూ రైల్వే ప్రాజెక్టులను రాష్ట్రాల వారీగా కాకుండా జోన్ల వారీగా మంజూరు చేయడం జరుగుతుందని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే వెబ్సైట్లో పొందుపర్చినట్లు చెప్పుకొచ్చారు. భద్రాచలం రోడ్ - సత్తుపల్లి రైల్లే లైన్ ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు. భద్రాచలం రోడ్ - కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో కొంత పంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, పెండింగ్లో ఉందన్నారు.