Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇచ్చిన సమయం 30 నిమిషాలు... ఉన్న సమయం గంట 15 నిమిషాలు
- అభినందనలు తెలిపిన కలెక్టర్, సీపీ
నవతెలంగాణ- బోనకల్
మండలంలో సీఎం కేసీఆర్ పర్యటన బుధవారం సాయంత్రం 6 గంటలకు ఖరారు కావడంతో కలెక్టర్ విపి గౌతమ్ ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల జిల్లా పరిషత్ సీఈవో వివి అప్పారావు బుధవారం రాత్రి నుంచి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు ప్రారంభించారు. మండలంలో రావినూతల, గార్లపాడు, రామాపురం గ్రామాలలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ హెలిపాడ్ కోసం స్థలాలను పరిశీలించారు. తొలుత రామాపురం గ్రామం వద్ద స్థలాన్ని ఎంపిక చేశారు. బుధవారం రాత్రి 10 గంటలకు తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కెసిఆర్ పర్యటన ఖరారు చేస్తూ పర్యటన వివరాలను వెల్లడించారు. అయితే రామాపురం వద్ద అనువైన స్థలం కాదని అనుమానంతో మరల బుధవారం రాత్రి 12 గంటల సమయంలో రావినూతలలోనే హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదురుగా విశాలమైన స్థలాన్ని కోసం ఎంపిక చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచే కలెక్టర్, పోలీస్ కమిషనర్ యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను గురువారం ఉదయం 10:30 కల్లా ఏర్పాటు పూర్తి చేశారు. రెండు హెలికాప్టర్ల కోసం రెండు హెలిఫ్యాడ్ లను అధికారులు సిద్ధం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు ఏర్పాట్లను పూర్తి చేయటంలో విశేషమైన కృషి చేశారు. ముఖ్యమంత్రి 11.45 గంటలకు రావినూతలలో హెలీఫ్యాడ్ వద్ద దిగారు. అక్కడ నుంచి రావినూతల, గార్లపాడు, రామాపురం గ్రామాలలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం విజయనిర్మల ఇతర జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ విజరు కుమార్ హెలిఫ్యాడ్ వద్ద ఏర్పాట్లను ప్రత్యేకంగా దగ్గరుండి పరిశీలించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన పంట నష్టపోయిన ఫోటో ఎగ్జిబిషన్‌ను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి పరిశీలించారు. కేసీఆర్ హెలీప్యాడ్ దిగిన వెంటనే అక్కడ నుంచి దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం తిరిగి రావినూతల వచ్చి విలేకరుల సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోయారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెలువడిన టూర్ ప్రోగ్రాం ప్రకారం కేవలం బోనకల్ మండలంలో 30 నిమిషాలు మాత్రమే సీఎం ఉంటారని ప్రకటించారు. కానీ అదనంగా 45 నిమిషాలు ఉండటం విశేషం. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి సీఎంవో ప్రత్యేక అధికారిని స్మీతా సబర్వాల్ అగర్వాల్, డీజీపీ అంజనీ కుమార్ ఉన్నారు.
భారీ పోలీస్ బందోబస్తు
సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటిలిజెన్స్ డీఐసి ఖమ్మం మాజీ పోలీస్ కమిషనర్ తాప్సీర్ ఇక్బాల్, ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఆరుగురు ఏసీపీలు 12 మంది సీఐలు 20 మంది ఎస్‌ఐలతోపాటు మొత్తం 200 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా కార్యక్రమం జరగడంతో జిల్లా ఉన్నతాధికారులు ఆనందం వ్యక్తం చేశారు.
అధికారులకు అభినందనలు: కలెక్టర్, సిపి
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు పనిచేసిన సహకరించిన అధికారులకు ప్రజలకు కలెక్టర్ విపి గౌతం, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సహకరించిన మీడియా మిత్రులందరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.