Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోనకల్లో పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్
- రైతు వట్టికొండ రామకృష్ణతో మాట్లాడిన కేసీఆర్
నవతెలంగాణ - బోనకల్
అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటామని, రైతులు అధైర్యపడొద్దని, తమది రైతు ప్రభుత్వంమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలో అకాల వర్షం వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను రావినూతల, గార్లపాడు, రామాపురం గ్రామాల్లో కేసీఆర్ సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుతో కలిసి గురువారం పరిశీలించారు.
రావినూతల గ్రామానికి చెందిన వట్టి కొండ రామకృష్ణ అనే రైతు పంటను కేసీఆర్ పరిశీలించారు. రామకృష్ణ 35 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేయగా 33 ఎకరాల పంట నేలకొరిగింది. దీంతో కేసీఆర్ రామకృష్ణకు చెందిన దెబ్బతిన్న మొక్కజొన్న పంటను స్వయంగా పరిశీలించారు. అనంతరం బాధిత రైతు దంపతులు రామకృష్ణ, నాగరాణితో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడారు. రామకృష్ణ తాను 35 ఎకరాలలో 33 ఎకరాలను కౌలుకి తీసుకొని మొక్కజొన్న పంట సాగు చేశానని, ఇందుకోసం సుమారు పది లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టానని వివరించారు. తాను తీవ్రంగా నష్టపోయానని ముఖ్యమంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ముఖ్యమంత్రి స్పందిస్తూ ప్రకృతి రైతులను నష్టపరిచిందని, ఈ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని నీకు ప్రభుత్వం తప్పనిసరిగా సహాయం అందజేస్తుందని, ఎటువంటి ఆందోళన, నిరాశకు గురి కావద్దని రైతుకు కేసిఆర్ ధైర్యం చెప్పారు. దాదాపు 20 నిమిషాల పాటు రామకృష్ణతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇదే సమయంలో సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, జెడ్పీ చైర్మెన్ లింగాల కమల్ రాజు కౌలు రైతుల పరిస్థితి గురించి ముఖ్యమంత్రికు వివరించారు. ఎకరానికి ఎకరానికి 20 వేలు కౌలు చెల్లించానని రైతు ముఖ్యమంత్రి కి వివరించాడు. వెంటనే కెసిఆర్ స్పందిస్తూ ప్రభుత్వం అందించే సహాయం పంట సాగు చేసిన కౌలు రైతులకే నేరుగా చెల్లిస్తామని వారి ముందు రైతులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం తనను ఆదుకుంటుందని నమ్మకం కలిగిందని రామకృష్ణ తెలిపాడు.
అధైర్యపడవద్దు రైతులను ఆదుకుంటాం
: కౌలు రైతు కొచ్చర్ల కృష్ణతో కేసీఆర్
అకాల వర్షం వల్ల నష్టపోయిన మొక్కజొన్న కౌలు రైతులను ఆదుకోవాలని కేసీఆర్ ను గార్లపాడు గ్రామానికి చెందిన కొచ్చర్ల కృష్ణ అనే కౌలు రైతు వేడుకున్నాడు. కొచ్చర్ల కష్ణ పొలాన్ని కేసీఆర్ పరిశీలించారు. సందర్భంగా కేసీఆర్ కౌలు రైతులతో మాట్లాడారు. ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎన్ని ఎకరాలు పంట వేశారని కొచ్చర్ల కష్ణ అనే రైతును అడిగారు. రైతు సమాధానం ఇస్తూ నేను 18 ఎకరాలు కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నానని సుమారు రెండు ఎకరాల్లోని మొక్కజొన్న పంట నేలమట్టమైనట్లు కేసీఆర్ కు విన్నవించాడు. ఎకరానికి వచ్చేసి 50 వేలు ఖర్చు వస్తుందని దానిలో 20 వేలు రూపాయలు కౌలు దించామని, 30 వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టానని ముఖ్యమంత్రి కి వివరించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి అక్కడే ఉన్న కలెక్టర్ తో మాట్లాడి రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అనేక మంది రైతులు తమ తమ సమస్యలను ముఖ్యమంత్రిగా వివరించారు.
ఆయా సమావేశాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.