Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
బిజెపి దేశానికి చాలా ప్రమాదకరమని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర గురువారం ఖమ్మం నగరం నుంచి రూరల్ మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా యాత్రకు నాయుడుపేట వద్ద సిపిఎం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నాయుడుపేట నుంచి మొదలైన యాత్ర పల్లెగూడెం నుంచి ఎం. వెంకటయపాలెం వరకు డప్పు దళంతో, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీతో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఎం. వెంకటయపాలెంలో బహిరంగ సభ నిర్వహించారు.ఈ సభకు సభాధ్యక్షుడుగా సిపిఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ వ్యవహరించారు.ఈ సభలో తమ్మినేని మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారం చేపట్టి తొమ్మిదేళ్లు అవుతున్న 18 కోట్ల ఉద్యోగాలకు కనీసం కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పాలు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారన్నారు.రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో స్వతంత్ర సంగ్రామం తర్వాత అంత పెద్ద ఉద్యమం జరిగిందని కొనియాడారు.రైతుల పట్టుదల చూసి మోడీ రైతులకు తలవంచక తప్పలేదన్నారు. రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసి, లౌకికవాదాన్ని దెబ్బతీసి రాజ్యాంగాన్ని లేకుండా చేసేందుకు మోడీ-షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.రైల్వే, ఓడరేవులు,సింగరేణి, ఉక్కు ఫ్యాక్టరీలు తన స్నేహితులైన ఆదాని-అంబానీలకు అప్పనంగా కట్టబెట్టేందుకు మోడీ కృషి చేస్తున్నాడని విమర్శించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినే సుదర్శన్ రావు, బి.వెంకట్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు మౌలానా, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్,పుచ్చకాయల సుధాకర్, బాణోత్ రాం కోటి,మిడికంటి వెంకట్‌రెడ్డి, సిపిఎం రాష్ట్ర నాయకులు సాయిబాబా, పాలడుగు భాస్కర్ తదితరులు ప్రసంగించారు. కార్యక్ర మంలో సిపిఎం నాయకులు బండి రమేష్,ఉరడీ సుదర్శన్‌రెడ్డి,షేక్ బషీరుద్దీన్, నవీన్‌రెడ్డి, పి.మోహన్ రావు, పి.సంగయ్య, కృష్ణ, ఉరడీ హైమావతి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.