Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
- కేంద్ర ప్రభుత్వం మరో పది వేలు జోడించాలి
- ఎండిపోయిన మొక్కజొన్న, వరి పంటను నష్టపరిహారం జాబితాలో చేర్చాలి
- తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ-ఖమ్మం
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వడగళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసి జీవో విడుదల చేయడం పట్ల తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. పరిహార పంపిణీలో కౌలు రైతులకు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించి కౌలు రైతులకు పరిహారం జీవో కూడా విడుదల చేయడం హర్షణీయమని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవన్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ అధ్యక్షతన జరిగిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ పంట నష్టపరిహారం కోసం రైతుల పోరాటం ప్రారంభం కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించి ఖమ్మం జిల్లా పర్యటనలో ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం అందించే నిర్ణయం చేయడం అభినందనీయం అన్నారు. వాస్తవానికి జిల్లాలో అకాల వర్షాలు, వడగండ్ల వానతో రైతులు ఎక్కువగా అంటే ఎకరాకు యాభై వేల రూపాయలు పైగా నష్టపోయారని అన్నారు. గతం కంటే రెండు రెట్లు నష్టపరిహారం పెంచాలని, అందులో కౌలు రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామంగా రైతు సంఘం భావిస్తుందన్నారు. కౌలు రైతులను గుర్తించి అన్ని రకాల సహాయం మిగతా రైతులు లాగా అందించాలని తెలంగాణ రైతు సంఘం, సిపిఎం గత తొమ్మిది సంవత్సరాలుగా కృషి చేస్తోందని, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సిపిఎం పోడు, కౌలు రైతుల సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంను గట్టిగా డిమాండ్ చేయడం జరిగిందని, గురువారం ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటనలో పంట నష్టపరిహారం ప్రకటన సందర్భంగా కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రత్యేకంగా గుర్తు చేయడంతో ముఖ్యమంత్రి కౌలు రైతులకు పరిహారం అందించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పది వేలకు కేంద్ర ప్రభుత్వం మరో పది వేల రూపాయలు పరిహారం జోడించాలని డిమాండ్ చేశారు. నిబంధనల పేరుతో నష్టపోయిన రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని, సాగర్ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందక ఎండిపోయిన మొక్కజొన్న, వరి పంటను కూడా పరిహారం జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాతా భాస్కరరావు, దుగ్గి కృష్ణ, శీలం పకీరమ్మ సహాయ కార్యదర్శలు చింతనిప్పు చలపతిరావు, ఎస్కే మీరా తదితరులు పాల్గొన్నారు.