Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతంలో గెలిచిన చోట అవకాశం వస్తే మళ్లీ పోటీ
- రాబోయే ఎన్నికల్లోనూ ఐక్యంగానే బీఆర్ఎస్, కమ్యూనిస్టులు
- మా బావ నాకు... నేను మా బావకు సహకరించుకుంటాం..
- పాలేరు ఎమ్మెల్యే కందాలను ఉద్దేశించి తమ్మినేని వ్యాఖ్యలు
- 8వ రోజు తిరుమలాయపాలెం, కూసుమంచి, తెల్దారుపల్లి,ముదిగొండల్లో సభలు
- మద్దులపల్లిలో సీపీఐ(ఎం)లో భారీగా చేరికలు
- ఊరూరా యాత్రకు కోలాటాలు, హారతులు, పూలతో స్వాగతం
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయ ప్రతినిధి
బీఆర్ఎస్తో భవిష్యత్ ఎన్నికల్లోనూ కలిసి నడిచే అవకాశం ఉన్న నేపథ్యంలో గతంలో గెలిచిన స్థానాల్లో తిరిగి మళ్లీ పోటీ చేసి ఎర్రజెండా ఎగరేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపులో కీలకపాత్ర వహించిన కమ్యూనిస్టులతో భవిష్యత్తులోనూ కలిసి నడిచేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆసక్తితో ఉన్న దృష్ట్యా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో బలమున్న చోట అవకాశాలను బట్టి కమ్యూనిస్టులు పోటీ చేస్తారని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి టిక్కెట్ వస్తే కమ్యూనిస్టులు...కమ్యూనిస్టులకు లభిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం సహకరించుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఒకరినొకరు బావ అని సంబోధించుకునే చనువు ఉన్న పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిని ఉద్దేశించి తమ్మినేని ఆసక్తికరంగా మాట్లాడకొచ్చారు. 'బీఆర్ఎస్, కమ్యూనిస్టుల పొత్తులో భాగంగా సీపీఐ(ఎం)కు టిక్కెట్ వస్తే మా బావ గారు సహకరిస్తారు... మా బావకి టిక్కెట్ వస్తే సీపీఐ(ఎం) వెంట ఉండీ మరీ గెలిస్తుంది..' అనడంతో 8వ రోజు యాత్రలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కూసుమంచి సభలో చప్పట్లు మార్మోగాయి. బీజేపీ భారత ఆర్థిక సారభౌమత్వాన్ని నాశనం చేస్తోందని...ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ టోకుగా అమ్మేస్తుందన్నారు. ఆ స్కాం ఈస్కాం పేరుతో ప్రతిపక్షాలపై దాడులు చేసే బీజేపీ మోడీ స్నేహితుల రూ.వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడినా వారి జోలికి వెళ్లదన్నారు. బీఆర్ఎస్తో విభేదించిన కొందరు నాయకులు జంక్షన్లో ఉన్నారన్నారు. బీజేపీ పేరుతో కుల్లు, డబ్బు రాజకీయాలస్తే దేశం నాశనమవుతుందన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యతే సీపీఐ(ఎం) లక్ష్యమన్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా యాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పంటనష్టాలపై సీఎం కేసీఆర్ ప్రకటన హర్షనీయం: తమ్మినేని
అకాల వర్షాలతో చోటుచేసుకున్న పంటనష్టాలను జనచైతన్యయాత్రలో భాగంగా ప్రత్యక్షంగా చూశాం...మిర్చి, మొక్కజన్న తదితర పంటలు భారీగా దెబ్బతిన్న విషయంపై సీఎంకు లేఖ రాశానని తమ్మినేని తెలిపారు. దీనిపై స్పందించిన ఆయన తాను బోనకల్ మండలం రావినూతల సభలో ఉన్నప్పుడు సీఎం పేషీ నుంచి సమాచారం ఇచ్చారని తెలిపారు. బోనకల్ మండలంలో దెబ్బతిన్న మొక్కజన్న పంటలను పరిశీలించారని, ఆయనతో పాటు పంటల పరిశీలనకు రావాల్సిందిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును, ఇటు తనను ఆహ్వానించారన్నారు. ఈ మేరకు పంటల పరిశీలనకు వెళ్లిన తాను నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరానికి రూ.20వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశానన్నారు. అందుకు సీఎం మొక్కజన్నకు రూ.3000 మాత్రమే పరిహారం ఇచ్చేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిబంధనలు ఉన్నట్లు తెలిపినట్లు చెప్పారు. నిబంధనలు మార్చుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉన్న దృష్ట్యా వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో మాట్లాడి ఎకరానికి రూ.10వేలు పరిహారంగా ప్రకటించినట్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా ఈపరిహారం అందేలా చూడాలని కోరానని, దానికి తొలుత ఆయన విముఖత వ్యక్తం చేసినా ఆ తర్వాత సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఇదే స్నేహపూర్వక వాతావరణం భవిష్యత్తులోనూ బీఆర్ఎస్తో కొనసాగిస్తామన్నారు. కాబట్టి కార్యకర్తలు కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని తమ్మినేని పిలుపు నిచ్చారు.
8వ రోజు యాత్రకు విశేష స్పందన
8వ రోజు శుక్రవారం జనచైతన్య యాత్రకు విశేష స్పందన లభించింది. ఊరారా జనం యాత్రకు ఘనస్వాగతం పలికారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం నుంచి బయలుదేరిన యాత్ర తిరుమలాయపాలెం మండల కేంద్రానికి చేరుకుంది. అక్కడ గ్రామస్తులు యాత్ర రథం ఎదుట బిందెలతో నీళ్లు పోసి స్వాగతించారు. అక్కడ సభ ముగిసిన అనంతరం కూసుమంచి వెళ్తుండగా మార్గంమధ్యలో ఏలువారిగూడెం వద్ద వెల్మరెడ్డి సత్యనారాయణరెడ్డి స్మారక స్థూపం వద్ద తమ్మినేనితో పాటు యాత్రబృందం నివాళి అర్పించింది. ఆతర్వాత బీరోలు పాయచెరువు కట్ట వద్ద తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ముర్కూరి నర్సిరెడ్డి స్థూపం వద్ద కూడా తమ్మినేని పూలమాల వేసి నివాళి అర్పించారు. కూసుమంచి మండలంలోకి యాత్ర ప్రవేశిస్తున్న సందర్భంగా పోచారంలో మహిళలు కోలాటాలు, పూలచల్లుతూ స్వాగతించారు. కిష్టారంలోనూ ఇదే పరిస్థితి. కూసుమంచి ప్రవేశంలోనూ మహిళలు, పురుషులు రోడ్డుపొడవునా బారులు తీరి యాత్ర బృందంపై పూలు చల్లుతూ సభా వేదిక వరకూ తీసుకెళ్లారు. ఈ దృశ్యాలను పలువురు సెల్‌ఫోన్ కెమెరాలలో బంధించుకోవడం కనిపించింది. అనంతరం యాత్ర మద్దులపల్లికి చేరినప్పుడు కూడా స్థానికలు ఇలాగే పూలు చల్లి ఆహ్వానించారు. తెల్దారుపల్లిలో పూలుచల్లుతూ... హారతిలిస్తూ...బాణసంచా పేల్చుతూ యాత్రను స్వాగతించారు. గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి తమ్మినేని యాత్రసభ్యులు పూలమాలలు వేశారు. ముదిగొండలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇలా యాత్రలో భాగంగా ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఆహ్వానించారు. షెడ్యూల్లో లేనప్పటికీ పొన్నెకల్ గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు యాత్ర ర్యాలీ ఆ గ్రామం మీదుగా కొనసాగించారు. అక్కడి ప్రజలు కూడా పూలచల్లి యాత్రను స్వాగతించారు. మద్దులపల్లిలో సీపీఐ(ఎం) మాజీ జిల్లా నాయకులు నల్లపునేని అప్పారావు ఆధ్వర్యంలో 10 కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ యాత్రలో సీపీఐ(ఎం) జాతీయ నాయకులు బి.వెంకట్, ఎం.సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, మల్లు లక్ష్మి, పాలడుగు భాస్కర్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి, యర్రా శ్రీకాంత్, వై.విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు నండ్ర ప్రసాద్, ఎడవల్లి రమణారెడ్డి, కొమ్ము శ్రీను, ఎస్. నవీన్‌రెడ్డి, బషీర్, సిద్ధినేని కోటయ్య, జిల్లా నాయకులు తమ్మినేని వెంకట్రావ్, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.