Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసిఆర్ వల్లే అన్ని విధాల అభివృద్ది
- తెలంగాణ పథకాలు దేశంలో ఎక్కడా లేవు
- కేవలం 8ఏళ్లలోనే ప్రజల జీవన శైలిలో మార్పు
- పార్టీయే ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది
- బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్రంలో పార్టీ మూడవ సారి హ్యాట్రిక్ కొట్టాలని, అందుకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా కషి చేయాలని, ఇప్పటి వరకు మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్తేనే చాలు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చేపడుతున్న సంక్షేమం పథకాల వల్లే నేడు తెలంగాణ అన్ని విధాల అభివృద్ది చెందిందని అన్నారు. ఆదివారం ఖమ్మం నగరం దోరేపల్లి ఫంక్షన్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ టూ టౌన్ కమిటీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను ఇక్కడ ఓ పండుగ వాతావరణంలో ఇంటిల్లిపాదితో అందర్నీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ ద్వారా నేడు నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన కేసీఅర్కి మొదటిగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎవరైనా నాతో పాటుగా కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేశారు. పార్టీ పట్ల విధేయత, నాయకుని మాట జవదాటకుండా పూర్తి విశ్వాసంగా ఉండడం, ఎన్నుకున్న ప్రజలకు, నమ్ముకున్న కార్యకర్తలకు సేవ చేయాలని సూచించారు. మీ ప్రేమ, అభిమానం వల్లే నేడు నేను ఇక్కడ ఉన్నానని, మీ అజరు అన్న ఎమ్మెల్యేగా చేసుకోవాలని మీరు అనుకున్నారు నేను గెలిచాను.. గెలిచాను ముఖ్యమంత్రి కేసీఅర్ నాకు మంత్రిగా పని చేయగలిగే అవకాశం కల్పించారని అన్నారు. ప్రతి గడపకు కేసిఆర్ ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరుతున్నాయని, ఎవరు మంచి చేస్తున్నారో.. ఎవరు మాటలు చెప్తున్నారో విజ్ఞులైన ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. నగరంలో వేల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలను ద్విచక్ర వాహనంపై ఇంటింటికి వెళ్లి ఇస్తున్నాం.. ఇలా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలు ప్రతి గడపకు అందిస్తున్నామన్నారు.
త్వరలో ఎన్నికలు రానున్నాయని ,కొత్త కొత్త పగటి వేషగాళ్లు ఇళ్లకు వస్తుంటారని, వారి మాటలు నమ్మొద్దని, బీజేపీ, కాంగ్రెస్ అసత్య ప్రచారాలను బిఆర్ఎస్ శ్రేణులు సమర్థవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ శ్రేణులకు భోజనాలు వడ్డించి వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి నామా నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, సూడా ఛైర్మెన్ విజరు, ఏఎంసీ చైర్మన్ శ్వేత, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఆర్జీసి కృష్ణ, కార్పొరేటర్లు, పార్టీ వివిధ విభాగాల డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
సీపీఆర్ శిక్షణను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు వీలుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారికి చేపడుతున్న వర్గాల సీ.పీ.ఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ఖమ్మంలోని ఆదివారం దోరేపల్లి ఫంక్షన్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ టూ టౌన్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అవగాహన కల్పించారు. ఆకస్మికంగా గుండెపోటుతో ప్రాణాపాయ స్థితికి చేరిన వారికి సీ.పీ.ఆర్ ప్రక్రియను ఎలా అందించాలనే దానిపై ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ సిపిఆర్ అనే చిన్న ప్రక్రియ ద్వారా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని గమనించిన వెంటనే, ఏమాత్రం తాత్సారం చేయకుండా సీపీఆర్ ప్రక్రియను అమలు చేయాలని సూచించారు.