Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే
- భవిష్యత్ ఉండాలంటే కాంగ్రెస్‌ని గెలిపించాలి : రేణుకాచౌదరి
- జోడో యాత్రలో అపశృతి
నవతెలంగాణ-వైరా
బీజేపీ ఆగడాలను ఎదిరిస్తున్న రాహుల్ గాంధీపై కుట్ర పూరిత కేసు పెట్టి జడ్జీలను కొని, పదవులు ఆశ చూపి తప్పుడు జడ్జ్మెంట్ ఇప్పించి జైలుకు తరలించాలని చూస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలతో దేశ వ్యాపితంగా జైల్ భరో నిర్వహిస్తామన్నారు. ఆదివారం పీసీసీ కార్యదర్శి కట్టా రంగారావు అధ్యక్షతన పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రోద్యంలో పాల్గొని సాధించిన కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలని చూస్తున్న నరేంద్రమోడీ ధన మధం, అధికార మథం కాంగ్రెస్ ను కదిలించడం అసాధ్యం అన్నారు. తెలంగాణలో కెసిఆర్ అరాచక పాలన సాగుతుందన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఖిల్లా అని నినాదాలు చేయించారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పని అడిగినా డబ్బు అడుగుతున్నారని అన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు నిధులు రాక, చేసిన పనులకు బిల్లులు కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఖమ్మంలో దుర్మార్గ పాలన చేస్తున్న వారికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర హాత్ సే హాత్ జోడో యాత్ర చేసి దేశ పరిస్థితులను గమనించారని, కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చిన సమయంలో మోడీ ప్రభుత్వం కుట్ర పన్ని తప్పుడు కేసులు, తప్పుడు తీర్పుతో ఇబ్బందులకు గురిచేయడం దివాళ కోరు తనం అన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమై రాహుల్‌కు మద్దతుగా నిలిచేందుకు సిద్ధమయ్యారని, బీజేపీ దుర్మార్గాలను ప్రపంచం దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ సభలో ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి, నబీద్ జావేద్ తదితరులు పాల్గొన్నారు.
భావితరాలకు భవిష్యత్ ఉండాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలి :
వైరాలో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
దేశంలో, రాష్ట్రంలో భావితరాలకు భవిష్యత్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మాజీ కేంద్రమంత్రి, ఫైర్ బ్రాండ్ గారపాటి రేణుక చౌదరి పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి హత్ సే హత్ కార్యక్రమంలో భాగంగా వైరాలో రామ్మూర్తి నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ల రంగారావు అధ్యక్షతన జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. మూడు రంగుల జెండాలో గాంధీ కుటుంబ రక్తం ఉందని, ఆయనను జైలుకు పంపితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దేశంలో ఉన్న సంపదనంతా అంబానీ, ఆదాని కుటుంబాలకు కట్టబెడుతూ ఇదేమని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై అనర్హత వేటివేయడం ప్రజల గమనిస్తున్నారన్నారు. ప్రధాని మోడీకి దేశ ప్రజలే తగిన శిక్ష వేస్తారని అన్నారు. దేశంలో గతంలో కుల, మతాలు ఘతీతంగా ప్రజలు స్నేహభావంతో ఉన్నారని, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మత విద్వేషాలు పెంచుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు.
వైరాలో జోడోయాత్రలో అపశృతి
కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి నడుపుతున్న ట్రాక్టర్ టైరు కింద ప్రమాదవశాత్తు ఖమ్మం కార్పొరేట్ భర్త ముస్తఫా పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.