Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడం కోసం పోరాటాలు చేయడమే ఉపాధ్యాయ ఉద్యమ ఆదర్శనేత, అమరజీవి అప్పారి వెంకటస్వామికి ఘనమైన నివాళి అని ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. టీఎస్ యూటీఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి (ఏవీఎస్) 22వ వర్ధంతి సభ స్థానిక జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో సంఘం జిల్లా అధ్యక్షుడు జీవీ నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సభకు నర్సిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రాంతాలు, కేడర్లు, మేనేజ్ మెంట్ల వారీగా ఉపాధ్యాయ ఉద్యమం చీలిపోయిన సందర్భంలో అందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ను స్థాపించి, అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలుగా రాష్ట్రంలో అగ్రగామి సంఘంగా ఏవీఎస్ తీర్చిదిద్దారన్నారు. ఉపాధ్యాయుని సామాజిక హౌదా పెంపుదలకు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఉద్యమాలు రూపొందించడంలో అప్పారి కీలక భూమిక పోషించారన్నారు. ఉద్యమ కార్యకర్తలలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, శాస్త్రీయ వైఖరులు పెంచడానికి కృషి చేశారన్నారు. పౌరులు, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంచడం రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎవియస్ స్ఫూర్తితో ఆ విధమైన కృషి చేయాలని నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 1974లో యూటీఎఫ్ స్థాపనలో కీలక భూమిక పోషించి, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నాయకులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. చనిపోయిన వారికి అశ్రునివాళులు అర్పించారు. ఈ సభలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావా రవి, రాష్ట్ర నాయకులు చావా దుర్గాభవాని, రాజు, పి.మాణిక్ రెడ్డి, ఎస్ కే మహబూబ్ అలీ, బండి నరసింహారావు, పారుపల్లి నాగేశ్వరరావు, కిషోర్ సింగ్, కృష్ణ, జిల్లా నాయకులు బుర్రి వెంకన్న, షమీ, వి.రాంబాబు, షేక్ రంజాన్, కె.గీత, జీఎస్ఆర్ రమేష్, పి.సురేష్, వీవీ రామారావు, బి.రాందాస్, ఎస్ సతీష్, కె. శ్రీకాంత్, మంగీలాల్, రాందాస్, కళ్యాణం నాగేశ్వరరావు, పూర్వ నాయకులు జి.రాజశేఖర్, ఎన్ వీరబాబు పాల్గొన్నారు.