Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
ఈసారి భద్రాచలం శ్రీ రామ నవమి మహౌత్సవానికి వీఐపీల తాకిడి భారీగా ఉండనుంది. దానికి తగినట్టుగానే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటులో కూడా చురుకుగా కొనసాగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు కూడా రానున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఆలయంలోనే జరుపుకోవడంతో భక్తులు శ్రీరామ కల్యాణానకి రాలేకపోయారు. ఈ సారి పుష్కర సామ్రాజ్య మహా పట్టాభిషేకం భద్రాచలంలో జరుగుతుంది. 12 ఏండ్లకు ఒకసారి జరిగే పుష్కర పట్టాభిషేకం కావటంతో సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణోత్సవానికి ఎంతసంఖ్యలో భక్తులు వస్తారో అదే స్థాయిలో పుష్కర పట్టాభిషేకానికి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుండి కూడా చిరు వ్యాపారస్తులు ఇప్పుడే భద్రాచలం చేరుకొని రామాలయ చుట్టూ నూతన వ్యాపారాలను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఒకవైపు శ్రీరామనవమి పట్టాభి షేకములకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుండగా భద్రాచలానికి ఈసారి ప్రముఖులు సందర్శన కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రెండు రోజులు ముందుగా భద్రాచలం రానున్నారు. ముందుగా పర్ణశాల చర్ల గిరిజన విద్యార్థులతో మాట్లాడనున్నారు. అనంతరం శ్రీరామ పుష్కర పట్టాభిషేక మహౌత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొనున్నారు. అదేవిధంగ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబంతో ఈనెల 30న భద్రాచలం శ్రీరామనవమికి రానున్నారు. సీఎం కేసీఆర్ ఒకరోజు ముందుగా భద్రాచలం రానున్నారు. శ్రీ రామ నవమికి సీతారామచంద్రస్వామి వారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర వేరుపడ్డాక ముఖ్యమంత్రి దంపతులు సీతారాముల కళ్యాణికి రావటం ఇది రెండోసారి కావటంతో అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు జిల్లా కలెక్టర్ ఉత్సవ పనులను తనిఖీ చేసి ఈనెల 28న మార్క్ డ్రిల్ కూడా అధికారులతో కలెక్టర్ నిర్వహించనున్నారు .ఇటు ఆర్డిఓ రత్నకుమారి కూడా ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తున్నారు. వీరితోపాటు రాష్ట్ర మంత్రులు ముగ్గురు రానున్నారు. వీరే కాక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్లమెంట్ మెంబర్లు ఎమ్మెల్యేలు భద్రాచలం రానున్నారు. హైకోర్టు జడ్జిలు ముగ్గురు భద్రాచలం రానున్నారు. ఇప్పటికే భద్రాచలంలో ఉన్న స్వచ్ఛంద సేవ సంస్థలు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం కోసం శ్రీరామ భక్తులకు అన్నదానం, పానకం, మజ్జిగ, చల్లటి మంచినీళ్లుఅందించడం కోసం వాళ్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే విధంగా దేవస్థానం ఈవో రమాదేవి నేతృత్వంలో డీఈ రవీంద్రనాథ్, ఏఈఓ శ్రవణ్ కుమార్ల బృందం ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తూ భక్తులకు, ప్రముఖులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. గత నెలలో భద్రాచలం లడ్డుపై వచ్చిన వివాదం వంటి ఆరోపణలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రసాదాల తయారీ కౌంటర్లను ఈవో దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే లక్ష్మీ నరసింహ సేవా బృందం దాదాపు 100 మంది భక్త బృందం రామాలయ పరిసర ప్రాంతంలో యాగ శాల వద్ద వివిధ రూపాల్లో సేవ కార్యక్రమాలు, మరోపక్క గోటితో వలిచిన తలంబ్రాలను భక్తులు స్వామి వారికి సమర్పించారు. జిల్లా అధికారులు కూడా ఏర్పాట్లు పరిశీలిస్తూ ఇటు భక్తులకి, ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. ఏడేండ్ల తర్వాత శ్రీరామనవమికి సీఎం కేసీఆర్ దంపతులు రానున్న నేపథ్యంలో ఈసారి భద్రాద్రి రామయ్య ఉత్సవాలు ప్రత్యేకతను చాటుకుంటున్నాయని చెప్పవచ్చు.