Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజర్వేషన్ అమలులో సింగరేణి భేష్
- జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు సుభాష్ పార్థి కితాబు
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి సంస్థ ఎస్సీ ఉద్యోగుల రిజర్వేషన్ అమలులో, పదోన్నతులు, సంక్షేమం వంటి అన్ని విషయాల్లోనూ నిబంధనల కన్నా మించి అమలు జరుపుతూ ఇతర కంపెనీలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు సుభాష్ పార్థీ ప్రశంసలు కురిపించారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో ఆయన సింగరేణి సంస్థ కంపెనీలో అమలు జరుపుతున్న ఎస్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్, పదోన్నతులు తదితర అంశాలపై సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్, పా) ఎన్.బలరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం జాతీయ కమిషన్ సభ్యులు సుభాష్ పార్థీ మాట్లాడుతూ దేశంలో చాలా పరిశ్రమల్లో నిర్దేశిత ఎస్సీ రిజర్వేషన్ 15 శాతం కన్నా తక్కువ అమలు జరపడం చూస్తుంటామని కానీ సింగరేణిలో 17 నుండి 20శాతం అమలు జరగడం అభినందనీయమన్నారు. అంబేద్కర్ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించడమే గాక అన్ని ఏరియాల్లో ఉత్సవాలు నిర్వహించుకోవడం కోసం ఒక్కొక్క ఏరియాకు రూ.60 వేలు మంజూరు చేయడం ప్రశంసనీయమన్నారు. అయితే దీనిని లక్ష రూపాయలకు పెంచాలని ఎస్సీ ఉద్యోగుల సంఘాలు కోరుతున్నాయని దీని పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండి ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఎస్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, ఎస్సీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక చీఫ్ లైజన్ ఆఫీసర్‌తో పాటు ప్రతి ఏరియాలో ఏరియా ఆఫీసర్లను నియమించామన్నారు. సమావేశంలో జాతీయ ఎస్సీ కమిషన్ హైదరాబాద్ రీజియన్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ బాబు, ప్రైవేట్ సెక్రటరీ నవీన్ రోహిలా, ఎన్.వి.కె. శ్రీనివాస్, జి.వెంకటేశ్వర్ రెడ్డి, ఎం.సురేశ్, కె.బసవయ్య, కుమార్ రెడ్డి, కె.నారాయణ, జీఎం మణుగూరు డి.రాంచందర్, ఎస్వో టూ డైరెక్టర్పీపీ ఎన్.సుధాకర్ రావు, దీక్షితులు, డీజీఎంలు శ్రీనివాస్, అజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.