Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ నామకు ఖమ్మం వ్యాపారుల ధన్యవాదాలు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎంపీ నామ నాగేశ్వరరావు కషితో ఖమ్మం పత్తి వ్యాపారుల సమస్యలకు పరిష్కారం లభించింది. ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు చెందిన ప్రతినిధి బృందం బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నాయకత్వంలో జీఎస్టీ చైర్మన్ వివేక్ జోహావిని న్యూఢిల్లీలో సోమవారం కలిశారు. సమస్యలను వివరించి, వినతి పత్రం అందజేశారు. ఎంపీ నామ దీనిపై చైర్మన్తో చర్చించారు. ఖమ్మం పత్తి వ్యాపారులు అవగాహన లేక 2017 నుంచి 2019 వరకు ఆర్సీఎం పద్దతిలో జీఎస్టీ చెల్లించారని తెలిపారు. కొత్త విధానంలో 2019 నుంచి ముడి పత్తి అమ్మకాలు, కొనుగోళ్లపైన జీఎస్టీ చెల్లించా రన్నారు. కానీ ఖమ్మంలోని జీఎస్టీ అధికారులు మొదటి నుంచి అమ్మకాలు, కొనుగోళ్లపైన జీఎస్టీ కట్టలేదని చెప్పి, పాత బకాయిలు కూడా కట్టాలంటూ నోటీసులు ఇచ్చారని చెప్పారు. పాత విధానంలోనే పత్తి వ్యాపారులు జీఎస్టీ కట్టినా దీనివల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, వారిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉప సంహరించుకోవాలని నామ జీఎస్టీ చైర్మన్ ను కోరారు. పత్తి వ్యాపారులు కొనుగోళ్లు ఆపితే రైతులు ఎంతో ఇబ్బంది పడతారు కాబట్టి వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాపారులు 2019 నుంచి ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తూ జీఎస్టీ కడుతున్నారని నామ చైర్మన్కు వివరించారు. జీఎస్టీ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. జీఎస్టీకి సంబంధించి ఖమ్మంలోని పత్తి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. నామ నాగేశ్వరరావు చేసిన వినతిని గమనంలో ఉంచుకొని సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని జీఎస్టీ చైర్మన్ ఎంపీ నామ నాగేశ్వరరావు కు తెలియజేశారు. జీఎస్టీ చైర్మన్ ను నామ నాగేశ్వరరావుతో పాటు ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షులు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు సోమా నరేష్కుమార్, కోశాధికారి తల్లాడ రమేష్, ఎగుమతి శాఖ అధ్యక్షులు నల్లమల ఆనంద్, కార్యదర్శి చెరుకూరి సంతోష్ కుమార్ కలిశారు. కాగా ఆదివారం ఖమ్మంలో పత్తి వ్యాపారులు నామ నాగేశ్వరరావును కలసి సమస్యలు వివరించగా, సోమవారం వారిని న్యూఢిల్లీ తీసికెళ్లి , సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు వ్యాపారుల బృందం ఎంపీ నామకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.