Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ విపి.గౌతమ్ సూచించారు. ఐడిఓసిలోని సమావేశ మందిరంలో గ్రౌండింగ్ అయిన యూనిట్ల నిర్వహణ, యూనిట్ల రెండో విడత వాయిదా మంజూరు, గ్రౌండింగ్ అయిన యూనిట్ల నిర్వహణకు నైపుణ్య శిక్షణపై అధికారులతో సోమవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. దళితబంధు పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన చింతకాని మండలంలో 3,462 మందికిగాను 3,385 మంది లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేశామన్నారు. యూనిట్ల నిర్వహణకు ఆయా శాఖలు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. యూనిట్లను స్వయంగా లబ్ధిదారులే నిర్వహించాలని, లీజుకు ఇవ్వడం తదితరాలతో అంతగా లాభం ఉండదని, పథక లక్ష్యం నెరవేరదని వివరించారు. గ్రౌండింగ్ అయిన ప్రతి యూనిట్‌పై ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని, దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. లీజుకు ఇచ్చిన యూనిట్లను స్వాధీనం చేరుకోవాలని, లబ్ధిదారులకు అవగాహన కల్పించి, అవసరమైతే మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. జేసిబి, అజాక్, హార్వెస్టర్ల డ్రైవింగ్, నిర్వహణపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు అద్దె వాహనాలు తీసుకునేప్పుడు, దళితబంధు యూనిట్ల కింద మంజూరైన వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వివిధ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు దళితబంధు కింద మంజూరైన జేసిబి యూనిట్ల జాబితా, వివరాలు ఇచ్చి, చేపట్టే పనుల్లో వినియోగించే విధంగా చూడాలన్నారు. కిరాణా షాపులు బిల్లుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. పేపర్ ప్లేట్, గ్లాసుల యూనిట్లను ప్రోత్సాహించాలన్నారు. మొదటి యూనిట్ సక్రమ నిర్వహణ చేపట్టి, లాభదాయకంగా ఉండి, అభివృద్ధి చెందుతున్న వారికి రెండో యూనిట్ మంజూరు చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు గ్రౌండింగ్‌కు ఉన్న మిగులు యూనిట్లపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టి పూర్తి చేయాలన్నారు. యూనిట్ల నిర్వహణపై సర్పంచులు, దళితబంధు కమిటీని బాధ్యులను చేయాలని, దుర్వినియోగం చేసిన గ్రామంలో ఇకముందు యూనిట్ల మంజూరులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, శిక్షణ సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, డీఆర్వో శిరీష, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.