Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఈ గైర్హాజరీపై జడ్పీ సభ్యుల మండిపాటు
- ప్రొటోకాల్ పై సభ్యురాలి నిలదీత
- రూ.10వేల పంట నష్ట పరిహారంపై సీఎంకు ధన్యవాదాలు
- ఖమ్మం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని జడ్పిటిసిలు, ఎంపీపీలు వండిపడ్డారు. మిషన్ భగీరథ జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ సమావేశాలకు రెగ్యులర్ గా గైర్హాజరవుతుండడంపై జిల్లా పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ లింగాల కమల్ రాజు అధ్యక్షతన జరిగింది. మిషన్ భగీరథ నీటి సరఫరా లో సమస్య ఉత్పన్నమైన 48 గంటల్లోనే పరిష్కారిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలపడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెనుబల్లి ఎంపీపీ లక్కినేని అలేఖ్య మండలంలో మిషన్ భగీరథ తీరుపై మండిపడ్డారు. ఈ పథకం నిర్వహణకు ప్రతినెల వేలకు వేల కరెంట్ బిల్లు వస్తుందని తెలిపారు. మిషన్ భగీరథ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఓ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసిన విషయం కూడా తమకు తెలియదు అన్నారు. మండలంలో ఏడు గ్రామాలకు అసలు నీరందట్లేదని జడ్పిటిసి మోహన్‌రావు ఆరోపించారు. టాప్స్ లేకపోవడంతో భగీరథ నీరు వథాగా పోతుందని ఎంపీపీ వరలక్ష్మి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మిషన్ భగీరథ పైప్ లైన్లు లీక్ అవడం నిత్యకృత్యంగా మారిందన్నారు. ఈ శాఖ ఎస్ఈ ఉన్నారా? ఉంటే ఒక్క సమావేశానికి కూడా హాజరు కారా? అని ముదిగొండ ఎంపీపీ సామినేని హరిప్రసాద్ ప్రశ్నించారు. సమావేశం విషయంలో ఎస్ఈ నిర్లక్ష్య ధోరణితో ఉన్నట్లు అవగతం అవుతుందని డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు ఆరోపించారు. దీనిపై చైర్మన్ కమల్ రాజ్ స్పందిస్తూ ఒక్క సమావేశానికి కూడా ఎస్ఈ హాజరు కావడం లేదని, వచ్చే సమావేశానికి హాజరుకాని పక్షంలో పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే వేసవి దృష్ట్యా నీటి సరఫరా పకడ్బందీగా జరిగేలా చూడాలని చైర్మన్ ఆదేశించారు.
ప్రొటోకాల్‌పై సభ్యురాలి నిలదీత
హెల్త్ సబ్ సెంటర్ల ఏర్పాటు విషయమై తమకు ఎలాంటి సమాచారం ఉండడం లేదని, పంగిడిలో సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న విషయం జడ్పీటీసీనైన తనకు తెలియదని, ప్రొటోకాల్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రఘునాథపాలెం జడ్పీటీసీ ప్రియాంక ప్రశ్నించారు. డీఎంహెచ్‌వో మాలతీని నిలదీశారు. మండలంలో ఏ కార్యక్రమం చేపట్టినా సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని, ప్రొటోకాల్ సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు.
పంట పరిహారంపై సీఎంకు ధన్యవాదాలు
ఇటీవల అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను జిల్లాలోని బోనకల్ మండలంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పరిశీలించారని, దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10,000 చొప్పున పరిహారం ప్రకటించడంపై సమావేశం సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసింది. అలాగే కౌలు రైతులకు కూడా పరిహారం ప్రకటించడంపై హర్షం వెలిబుచ్చింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కంటి వెలుగు, ఆరోగ్య మహిళా కేంద్రాల్లో అందించే వైద్యసేవలపై నివేదికను వివరించారు. సబ్ సెంటర్లు ఎక్కడ అవసరమున్నవో సభ్యులు ప్రతిపాదించాలని కోరారు. సంక్షేమ శాఖాధికారి మహిళాభివృద్ధి, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని ఏడు ఐసిడియస్ ప్రాజెక్టులలో 1605 మెయిన్ (235) మినీ మొత్తం 1840 అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము కింద 2022-23 ఆర్ధిక సంవత్సరానికి 81.16 లక్షల పని దినాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 3,03,797 కుటుంబాలలోని 6,44,673 మందికి జాబ్‌కార్డులు జారీచేశామని తెలిపారు. దీనికి గాను రూ.115.13 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఆసరా పింఛన్లపై సభ్యులు ప్రశ్నించారు. సుమారు 600 దరఖాస్తుల్లో ఈకెవైసి సమస్య ఉందని, ఆధార్ అప్డేట్, ఐరిస్ సరిచేయాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డిసిఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వివి.అప్పారావు, విద్యుత్, వైద్య ఆరోగ్య, సంక్షేమ, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల జిల్లా అధికారులు, జడ్పీటిసీలు, ఎంపిపిలు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.