Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి
- తహసీల్దారుకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ- సత్తుపల్లి
అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సత్తుపల్లి తహసీల్దారు శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద ఇండ్లు నిర్మించి పేదలకు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం, యేడాదికి లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి 9 యేండ్లు దాటినా పేదల ఇండ్ల నిర్మాణాల్లో విఫలం చెందారని విమర్శించారు. సొంతస్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణాలకు తొలుత రూ. 5లక్షలు ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడేమో రూ. 3లక్షలకు కుదించడం సరైంది కాదన్నారు. అది కూడా అమలుకు నోచుకుంటుందో లేదో అనుమానమేనన్నారు. సత్తుపల్లి మండలంలో సొంతస్థలాలు లేని పేదలు వేల సంఖ్యలో ఉన్నారన్నారు. స్థలాలు లేని వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాలని, స్థలాలున్న వారికి ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే కట్టిన డబుల్ నిర్మాణాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. తుంబూరు గ్రామంలో సర్వే నెంబరు 34లో 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అట్టి భూమిని భూమిలేని పేదలకు పంచాలన్నారు. కార్యక్రమంలో వ్యకాస మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, గద్దల వెంకటేశ్వరరావు, సాంబయ్య, ముత్తిని శ్రీను, తుమ్మలపల్లి యేసమ్మ, కంభంపాటి రామకృష్ణ, ఉంజునూరి విష్ణువాసు, మురళి, ఇస్తరయ్య, సుజాత, త్రివేణి, కళావతి పాల్గొన్నారు.