Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకరి అరెస్టు...రిమాండ్కు తరలింపు
- విలేకర్ల సమావేశంలో ఏసీపీ బస్వారెడ్డి
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఇంటి నిర్మాణ పత్రాలు తయారు చేసిన ఖమ్మం రూరల్ దిశ పత్రికా విలేకరి లక్ష్మారెడ్డిని ఆరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు ఖమ్మంరూరల్ ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సత్యనారాయణపురంలో గల ఏసీపీ కార్యా లయంలో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ వెల్లడించారు. గతంలో ఏదులాపురం, గుర్రాలపాడు గ్రామాలకు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి సంతకాలను ఫోర్జరీ చేసి ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చిన వ్యవహారంలో మండలంలోని నాయుడు పేటలో నివాసం ఉంటున్న ఖమ్మం రూరల్ దిశ పత్రికా విలేకరి యాసా లక్ష్మారెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి, లక్ష్మారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఈ కేసులో తనగంపాడు గ్రామానికి చెందిన నాగరాజు పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మారెడ్డి ఒక్కడే అరెస్టు కాగా, నాగరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల మండలంలో తనగంపాడు రెవెన్యూ పరిధిలోని 5.38 ఎకరాల భూమిని కాజేసేందుకు భూ యజమాని జీవించి ఉండగానే అతను, అతని భార్య చనిపోయారని నకిలీ మరణధ్రువపత్రాలు సృష్టించిన కేసులో మొత్తం 9 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించామని, వారిలో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించామన్నారు. మిగతా ఇద్దరిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఏసీపీ తెలిపారు. మండలంలో భూముల ధరలు పెరగడంతో నేరస్తులు ఏదో విధంగా భూములపై కన్నేసి వాటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని, దానికి అనుగుణంగానే తప్పుడు పత్రాలు, నకిలీ స్టాంప్స్ తయారుచేసి వాటి ద్వారా అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి ఖరీదైన భూములను సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఫోర్జరీ చేసే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా వివిధ బ్యాంకులలో నకిలీ ద్రువపత్రాలు, పహానిలు, భూమి పాసుపుస్తకాలు చూపించి రుణాలు కూడా తీసుకున్నట్లు సమాచారం ఉందని వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో సిఐ రాజిరెడ్డి, ఎస్ఐ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.