Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తమ ఫలితాల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
ఏప్రిల్ 3 నుండి జరగనున్న పదో తరగతి పరీక్షల్లో పది పాయింట్లు సాధించాలన్న లక్ష్యంతో పదో తరగతి విద్యార్థులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. 2020 సంవత్సరం నుండి కరోనా కారణంతో పదో తరగతి పరీక్షలు జరగకుండానే విద్యార్థులు పాస్ అవ్వటం 2021-2022 సంవత్సరంలో కూడా పూర్తిస్థాయిలో విద్యా సంవత్సరం నడవకపోవడం దానికి తగినట్టుగానే పరీక్షలు నిర్వహణ కూడా జరగటంతో ఫలితాలు కూడా ఆ స్థాయిలోనే వచ్చాయి. ఈ తరుణంలో ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో విద్యా సంవత్సరం నడవడం పూర్తి స్థాయిలో తరగతులు జరగడంతో ఈ సంవత్సర పదవ తరగతి పరీక్ష ఫలితాలపై ఆసక్తి నెలకొన్నది. అంతేకాకుండా గత సంవత్సరం వరకు పదో తరగతి పరీక్షలలో 11 పేపర్లతో నిర్వహించగా ఆ విధానాన్ని విద్యా కమిటీ సిఫార్సుతో మార్చి 6 పేపర్లతో ఈ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. గత సంవత్సరం వరకు హిందీ మినహాయించి ప్రతి సబ్జెక్టుకి రెండు పేపర్ల చొప్పున పరీక్షలు నిర్వహిస్తే ఈ సంవత్సరం ప్రతి సబ్జెక్టుకి ఒక్క పేపర్తోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో కొంత ఆందోళన కలుగుతుంది. గతంలో పది పరీక్షలలో మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ప్రశ్నలు ఉండేవి కానీ ఈ సంవత్సరం అటువంటి అవకాశం లేకుండా ప్రతి ప్రశ్నకి సమాధానం రాయాల్సిందే. కేవలం బిట్ పేపర్లో మాత్రమే ఆ అవకాశాన్ని కల్పించారు. దీంతో విద్యార్థులపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్ష మోడల్ కూడా గతంలో ఎన్నడు లేని విధంగా రెండు సార్లు మార్పులు చేశారు. ప్రధానంగా పట్టణానికి చెందిన లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలు, దివ్య హైస్కూల్, త్రివేణి స్కూల్, రూప హై స్కూల్, కోమల విద్యాలయం వంటి పాఠశాలలు ఎలాగైనా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అధిక సంఖ్యలో పది పాయింట్లు సాధించి ముందు వరుసలో నిలవాలని కృషి చేస్తున్నాయి. దానికి తగినట్టుగానే ఆయా పాఠశాలలో ప్రణాళికలు రచించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు.
ఏజెన్సీ విద్యార్థుల పైన కార్పొరేట్ కన్ను
ఇంటర్మీడియట్, ఐఐటీ, ఎన్ఐటీ వంటి విద్యలో ర్యాంకులు సాధించాలంటే ఆ విద్యార్థులు పదో తరగతి వరకు నేర్చుకున్న విద్య పునాదిగా ఉపయోగపడుతుంది. పదో తరగతి వరకు నాణ్యమైన విద్యను అభ్యసిస్తే ఆ తర్వాత చదివే విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించడం పెద్ద విషయం కాదని విషయం తెలిసింది. ఈ విషయాన్ని పసిగట్టి విద్యను వ్యాపారంగా మలచి ర్యాంకుల పేరుతో విద్య నువ్యాపారాన్ని సాగించాలన్న కార్పొరేట్ విద్యాసంస్థల కన్ను ఇప్పుడు భద్రాచలం ఏజెన్సీ పదో తరగతి విద్యార్థుల పై పడింది. ఈ ప్రాంత విద్యార్థులలో నర్సరీ నుండే నిర్దిష్టమైన విద్య పునాది కలిగి ఉంటున్నారని, గ్రహించి ఎలాగైనా ఇంటర్ ఆపై చదువులకి వీరిని వలపన్ని వారి విద్యాసంస్థల్లో చేర్పించి వీరి ద్వారా ర్యాంకులు సాధించాలని కార్పొరేట్ విద్యాసంస్థలైన నారాయణ చైతన్య ప్రగతి వంటి విద్యా సంస్థలు వారి పీఆర్ఓల ద్వారా ఇప్పటికే 10వ తరగతి విద్యార్థుల తల్లితండ్రులతో బేరసారాలు ప్రారంభించారు. ప్రతి పాఠశాలలోని ఉత్తమ ఫలితాలు సాధించే పది నుండి 20 మంది విద్యార్థుల వివరాలు సేకరించి నేరుగా వాళ్ళ ఇళ్లకు వెళ్లి వారి తల్లితండ్రులను మాయ మాటలు చెప్పి విద్యార్థులు తరలించకపోతున్నారు. కార్పొరేట్ స్థాయిలోనే భద్రాచలంలో కూడా ఇంటర్ విద్యని అందించే స్థాయి గల కళాశాలలు ఉన్నప్పటికీ విజయవాడ హైదరాబాదు వంటి ప్రాంతాలకు భద్రాచలం ఏజెన్సీ నుండి ప్రతి సంవత్సరం అత్యధిక మంది విద్యార్థులు వెళ్తున్నారంటే కార్పొరేట్ కన్ను భద్రాచలం పై ఎంత పడిందో చెప్పనక్కర్లేదు.