Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గణాంకాలు ఘనం..నిర్వహణ అస్తవ్యస్తం
- జిల్లాలో తరచూ లీకవుతున్న పైప్లైన్లు..
- లీకులతో ఈవారంలో 969 గ్రామాలకు నీరు బంద్
- నల్లాలు లేక వృథాగా పోతున్న నీరు
- జడ్పీ సమావేశంలో సభ్యుల ఆగ్రహం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. ఈ పథకం గణాంకాలు ఘనంగా ఉన్నా ఆచరణలో మాత్రం అనేక లోపాలు వెలుగుచూస్తున్నాయి. వైరా, పాలేరు రిజర్వాయర్లతో పాటు గోదావరి సెగ్మెంట్ నుంచి నీరు సరఫరా చేసేందుకు పంట చేలు, రోడ్డుమార్గాల పొడవునా పైపులైన్ ఏర్పాటు చేశారు. తరచూ ఈ పైపులైన్లు ఎక్కడో ఒక్కచోట దెబ్బతింటున్నాయి. తద్వారా నీరు వృథాగా పోవడంతో పాటు కలుషితం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పైపులైన్ల లీకేజీ నుంచి నీరు భారీగా ఎగిసిపడుతుండటంతో పలుచోట్ల రోడ్డు ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. గురువారం ఖమ్మం నగరంలోని దాన్వాయిగూడెం వద్ద పైప్‌లైన్ దెబ్బతినడంతో బ్లోఅవుట్ తరహాలో నీరు ఎగిసిపడింది. నగరానికి నీరు సరఫరా నిలిపివేసి, యుద్ధప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టారు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయనే ఆరోపణలున్నాయి. ఈ పథకం నిర్వహణలో చోటుచేసుకుంటున్న లోపాలపై ఈనెల 28వ తేదీన నిర్వహించిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో సభ్యులు మండిపడ్డారు. ఈ పథకం పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్ఈ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం బాధ్యతలు కూడా చూస్తున్నారు. తరచూ ఆయన ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశాలకు సమాచారం లేకుండా గైర్హాజరవుతుండటంపైనా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 2,92,642 గృహాలకు నీరు సరఫరా చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ వీటిలో సగానికి పైగా ఇళ్లలో కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో నీరు వృథాగా పోవడంతో పాటు కలుషితం అవుతున్నాయని జడ్పీ సమావేశంలో సభ్యులు ఆరోపించిన విషయం విదితమే.
సరఫరా సరే...లీకుల మాటేంటి..?
జిల్లాలోని 20కి 17 మండలాలకు మిషన్ భగీరథ నీరు రెండు సెగ్మెంట్లుగా పాలేరు, వైరా జలాశయం నుంచి సరఫరా అవుతోంది. మిగిలిన మూడు మండలాలు కామేపల్లి, సింగరేణి, సత్తుపల్లికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి సెగ్మెంట్ నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. పాలేరు జలాశయం నుంచి ఏడు మండలాల్లోని 385 గ్రామాలతో పాటు ఖమ్మం నగర పాలక సంస్థకూ నీరు సరఫరా చేస్తున్నారు. వైరా జలాశయం నుంచి 11 మండలాల్లో 461 గ్రామాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలంతో కలిపి వైరా, మధిర మున్సిపాల్టీలకు వాటర్ ట్రీట్మెంట్ చేసి శుద్ధ జలాలను సరఫరా చేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్, ఖమ్మం డివిజన్ కార్యనిర్వహక ఇంజినీర్ వై.వాణిశ్రీ తెలిపారు. కానీ ఈ వారంలోనే లీకేజీల వల్ల 969 గ్రామాలకు గాను 20 ఊళ్లకు నీరు సరఫరా జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఇలా తరచూ లీకులు ఏర్పడుతుండటంతో ఊళ్లకు ఊళ్లు సరఫరా నిలిపివేయాల్సి వస్తుందనే ఆరోపణలున్నాయి.
పేరుకే మానిటరింగ్ సెల్...
ఇక రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ హెడ్ ఆఫీస్, ఖమ్మం సర్కిల్ కార్యాలయాల్లో మిషన్ భగీరథ నీటిసరఫరా ఫిర్యాదుల కోసం మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నామంటున్నారు.కానీ దీని విషయమే తమకు తెలియదని జడ్పీ సమావేశంలో సభ్యులు ప్రశ్నించారు. జిల్లాలో 1483 ట్యాంకులకు గాను 1448 ట్యాంకులకు ప్రతిరోజూ నీరు సరఫరా అవుతున్నాయని అధికారులు చెబుతున్నా వీటి నుంచి నీటి సరఫరా పైనా సమావేశంలో సందేహాలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో 2,378.895 కి.మీ పైపులైన్ కొత్తగా, 1908.148 కి.మీ పాత పైపులైన్లు ఉన్నాయి. వీటిలో వందల కి.మీ పైపులైన్లు నిత్యం లీకవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇక పాత పంపు కనెక్షన్లు 1,07285, కొత్తవి 1,85,357 నల్లా కనెక్షన్లు ఉన్నట్లు చెబుతున్నా...వీటిలో నల్లాలు లేనివి, వున్నా పనిచేయక నీరు వృథాగా పోతున్న కనెక్షన్లు భారీగానే ఉంటాయని జడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశంలో ప్రస్తావించారు. అధికార పార్టీ సభ్యులే నూటికి 95శాతం ఉన్న జడ్పీ సమావేశంలోనే ఇన్ని సమస్యలు మిషన్ భగీరథ పథకం తీరుపై లేవనెత్తడాన్ని బట్టి ఈ పథకం లోపభూయిష్టంగా నిర్వహించబడుతుందనేందుకు నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తుండటం గమనార్హం.