Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
రైతుల సహకారంతోనే ఏ పరపతి సంఘం అయినా అభివృద్ధి పథకంలో నడుస్తుందని అశ్వారావుపేట పీఏసీఎస్ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ అన్నారు. పంటల సాగుకు అవసరమైన నాణ్యమైన సేవలు అందించేందుకు పాలకవర్గం దృష్టి సారిస్తుందని, రుణాలను సద్వినియోగం చేసుకుని తిరిగి సకాలంలో చెల్లించటం వల్ల సొసైటీ మరింత ఆర్థిక బలోపేతం సాధిస్తుందని చెప్పారు. స్థానిక కార్యాలయంలో సొసైటీ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం కూడా సొసైటీ ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు పూర్తి సహాకారం అందిస్తుందని చెప్పారు. సొసైటీ నుండి రైతులకు అందించే సేవలను విస్తరించేలా ప్రణాళిక రూపొందించామని అన్నారు. సహాకార సంఘం సేవలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం రైతుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పామాయిల్ రైతులకు సొసైటీ నుండి వాణిజ్య బ్యాంకుల తరహాలో రుణాలు మంజూరు చేయాలని పలువురు రైతులు కోరారు. ఆయిల్ ఫాం రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఈవో మానేపల్లి విజయ్ బాబు, సొసైటీ పూర్వ అధ్యక్షులు అలపాటి రామ్మోహన రావు, పూర్వ ఉపాధ్యక్షులు సుంకవల్లి వీరభద్రరావు, మాజీ సర్పంచ్ కె.పుల్లయ్య, పాలకవర్గ సభ్యులు సత్తెనపల్లి వెంకటేశ్వరరావు, బత్తిన పార్ధసారధి, సంగా ప్రసాద్, వెన్నాడ చిట్టిబాబు, కొల్లు విజయ లక్ష్మి, జి.వెంకటేశ్వరరావు, తెల్లమేకల కన్నయ్య, కలపాల బాబూరావు, రైతులు యూఎస్ ప్రకాశరావు, తాడేపల్లి రవి, పలువురు రైతులు పాల్గొన్నారు.