Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందుత్వ నినాదాలతో ర్యాలీ
- ఆందోళన కారులకు పలు రాజకీయ నాయకుల మద్దతు
- అటవీ రేంజర్ కార్యాలయం పై దాడి
- ద్వజస్థంభానికి అనుమతిస్తానని రేంజర్ హమీ
నవతెలంగాణ-అశ్వారావుపేట
మండలంలోని గుమ్మడవల్లికి చెందిన గ్రామస్తులు, హిందూ సంఘాలు శుక్రవారం అశ్వారావుపేట అటవీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. దాడిలో కార్యాలయం కిటికీలు, కుర్చీలు ధ్వంసం అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గుమ్మడవల్లి గ్రామ సమీపంలోని పెద వాగు ప్రాజెక్టు వద్ద గ్రామస్తులు గంగానమ్మ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయం ఎదుట ధ్వజస్థంభం కోసం ఇటీవల పెద్ద వృక్షాన్ని కొందరు నరికి అడవి నుండి తీసుకొచ్చారు. ఈ మొద్దును ఫారెస్ట్ అధికారులు బుధవారం ముక్కలుగా చేసి అశ్వారావుపేట కార్యాలయానికి తరలించారు. దీనితో ఆగ్రహించిన గ్రామస్తులు, పలువురు హిందూ సంఘాల నాయకులను, రాజకీయ నాయకులను సంప్రదించారు. శుక్రవారం హిందూ సంఘాలు వాట్సాప్ సమూహాల్లో ప్రచారం చేసారు. వీరే పలు రాజకీయ నాయకులను, ప్రజా ప్రతినిధులను సమీకరించారు. స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ నుండి ప్రదర్శనగా ఫారెస్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే ఫారెస్ట్ అధికారుల పని తీరుపై ఆగ్రహంతో ఉన్న సమూహం ఒక్కసారిగా కార్యాలయంపై దాడికి పాల్పడింది. దాడిలో కార్యాలయం కిటికీ అద్దాలు, కుర్చీలు ధ్వంసం అయ్యాయి. తలుపులు తోసుకుంటూ రేంజర్ వద్దకు వెళ్ళే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన ఎస్హెచ్ఓ ఎస్ఐ రాజేష్ కుమార్ తన సిబ్బందితో ఆందోళన కారులను అడ్డుకున్నారు. అసహనంతో వారు కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఫారెస్ట్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనతో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తుల ఆందోళనకు బీఆర్ఎస్, టీడీపీ, హిందూ సంఘాలకు మద్దతుగా నిలిచాయి. ఆందోళనకారులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఎంపీపీ బల్లిపల్లి శ్రీరామ్మూర్తి, ఎస్సై రాజేష్ కుమార్, రాజకీయ పార్టీల నేతలు అటవీ అధికారులు ఆందోళనకారులతో పలుమార్లు చర్చలు జరిపారు. చివరికి రేంజర్ అబ్దుల్ రహ్మాన్ ఆలయానికి అవసరమైన ధ్వజస్థంభం ఏర్పాటుకు అనుమతి ఇప్పిస్తానని హామీ ఇవ్వటంతో ఆందోళనకారులు శాంతించారు. వారం రోజుల్లోగా ద్వస స్థంభం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేయటంతో అధికారులు అంగీకరించారు. అధికా రుల హామీతో గ్రామస్తులు ఆందోళనను విరమి ంచారు. ఆందోళనను నిర్మించడంతో పోలీసులు, రాజకీయ పార్టీల నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 3 గంటలకు పైగా ఆందోళన ఉద్రిక్త వాతావరణంలో సాగింది. ఈ విషయాన్ని ముందుగా గ్రామస్తులు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్ళగా అటవీ అధికారులకు తీవ్రంగా మందలించినట్లు తెలుస్తుంది. ఇదే విషయం రేంజర్ అబ్దుల్ రెహ్మాన్ వివరణ కోరగా కార్యాలయం పై దాడికి పాల్పడిన విషయం అయి పోలీస్లకు ఫిర్యాదు చేస్తున్నాను అని అన్నారు.