Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
మునిసిపాలిటీ ప్రారంభం నుండి నేటి వరకు సుమారు నాలుగు సంవత్సరాల పాటు డంపింగ్ యార్డుకు స్థలం లభించక అవస్థలు పడుతూ వైరా సమీపంలో జాతీయ ప్రధాన రహదారి పక్కన వైరా ప్రాజెక్ట్ ఏటి బ్రిడ్జి కింద డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో స్థల సేకరణకు తీవ్ర ప్రయత్నం చేశారు. చివరకు జిల్లా కలెక్టర్ కూడా రంగంలో దిగి ప్రభుత్వ భూములున్న గరికపాడు, కొండకుడిమ, తల్లాడ మండల పరిధిలోని కొడవటి మెట్ట( రెడ్డి గూడెం)లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. కాని అన్ని గ్రామాల ప్రజలు వైరా మునిసిపాలిటీ చెత్తను మా ఊరుకు తేవద్దని అడ్డుకున్నారు. చేసేది లేక ఏటి బ్రిడ్జి కింద డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయగా వాహన చోదకులకు దుర్గంధంతో పాటు నిరంతరం చెత్త కాలుతున్న పొగ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. పొగ వల్ల బ్రిడ్జిపై ప్రమాదాలు కూడా జరిగినవి. ముఖ్యంగా నిరంతరం కాలుతున్న చెత్త మంటల వలన బ్రిడ్జికి కూడా ప్రమాదం అని కూడా అధికారులు హెచ్చరించారు. డంపింగ్ యార్డులో చెత్తకు నిప్పు పెట్టిన కారణంగా అదే లైన్లో ఉన్న 11 కెవి విద్యుత్ లైన్ వైర్లు తెగిపోయి పలు గ్రామాలకు విద్యుత్ నిలిచి పోయింది. విద్యుత్ అధికారులు అప్రమత్తమై పరిస్థితి చక్కదిద్దారు. ఎట్టకేలకు ప్రాజెక్ట్ అలుగు వాగు సమీపంలో స్థలంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. అందువలన ఏటి బ్రిడ్జి వద్దకు ఇకపై మునిసిపల్ చెత్త తరలించబోమని, అంతే గాక గతంలో ఈ స్థలం ఎలా ఉందో మరలా అలా తయారు చేసి శుభ్రపరుస్తున్నట్లు కమిషనర్ అనిత, వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు తెలిపారు.