Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 రోజులుగా నీరు రాక 21ఏరియా వాసుల గోస
- అఖిలపక్షం ఆధ్వర్యంలో వినతి
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణి కాలరీస్‌కు చెందిన 21 ఏరియాలో గత పది రోజులుగా మంచినీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగరేణి ఆధ్వర్యంలో ఏరియాకు వీటి సరఫరా జరిగేది. మోటర్లు పాడై పది రోజులు అవుతుంది. యాజ మాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. తిలక్ నగర్ పంచాయతీ పరిధిలో ఏరియా ఉన్నప్పటికీ పాలక వర్గం పట్టించుకోవడం లేదు. బోర్లు, బావులు లేవు. మిషన్ భగీరథ పైపులు వేసినప్పటికీ నీరు సరఫరా జరగడం లేదు. సింగరేణి కుళాయిలు తప్ప అక్కడ ఎలాంటి నీటి వనరులు లేవు. దీంతో ఇంటి అవసరాలకు, తాగడానికి నీరు లేక పిల్లలు వృద్ధులు ఇంటిల్లిపాది అవస్థలు పడుతున్నారు. చుట్టాలు వచ్చినా శుభకార్యాలు జరిగిన నీటి ఘోసతో ఇబ్బందులు పడుతున్నారు. పైప్ లైన్లు సరిచేసి మోటార్లు బాగు చేసి మంచి నీరిప్పించండి సారూ అంటూ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో జీఎంకు వినతి
21 ఫీట్ ఏరియాకు మంచినీటి ఇబ్బందులు తొలగించాలని జీఎం షాలేము రాజుకు అఖిల పక్షం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం), సీపీఐ, బీఆర్ఎస్, టీడీపీ నేతలు అబ్దుల్ నబీ, వడ్ల శీను, క్లైంట్రోచ్, సురేష్, యాదగిరి, పెట్టి హరికృష్ణ తదితరులు మాట్లాడారు. తాతలు, తండ్రులు దశాబ్దాలుగా సింగరేణినిలో శ్రమను, చెమట చిందించారని పనిచేసి బొగ్గుత్పత్తికి తోడ్పడ్డామని అన్నారు. అవసరం తీరిపోయినట్లుగా వ్యవహరించకుండా మానవతా దృక్పథంతో సమస్యను పరిష్కరించాలని కోరారు.