Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ అధికారులు
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆశ్రమపాఠశాలలు, గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులందరూ అలాగే లాంగ్ ఆబ్సెంట్ ఉన్న విద్యార్థులు అందరినీ పిలిపించి వారిలో భయం పోగొట్టి మనోధైర్యాన్ని ఇచ్చి పరీక్షలు రాసే విధంగా సంబంధిత ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం హైదరాబాదు నుంచి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై తీసుకోవలసిన చర్యలపై ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా జెడ్ చంగ్తు, గురుకులం సెక్రెటరీ రోనాల్డ్ రోస్, ఏడి సర్వేశ్వర్ రెడ్డితో కలిసి రాష్ట్రంలోని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, సంబంధిత విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థుల విషయంలో సంబంధిత ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్లు పిల్లలందరూ సకాలంలో వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి బస్సు సౌకర్యం కల్పించాలని, బస్సు వెళ్ళలేని మార్గంలో ఆటోరిక్షాలు ఏర్పాటు చేయాలని, పిల్లల వెంట ప్రత్యేక బాధ్యతగల ఉపాధ్యాయులను వారి వెంట పంపి వారు పరీక్షలు రాయగానే తిరిగి వారి పాఠశాలలకు చేరే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థినీ, విద్యార్థుల పట్ల స్పెషల్ మెనోతో ఆహారంతోపాటు వారి ఆరోగ్యం పరంగా కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాలలో మంచినీటి సౌకర్యంతో పాటు విద్యుత్ సౌకర్యం విద్యార్థినీ విద్యార్థులు సులభంగా పరీక్షలు రాయడానికి డ్యూయల్ డెస్క్ బల్లాలు ప్రత్యేకమైన మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉంచాలని, ప్రస్తుతం వాతావరణం మారుతున్నందున ముఖ్యంగా ఓఆర్ఎస్ పాకెట్లు, మజ్జిగ, ప్యాకెట్లు ప్రతి పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉంచుకోవాలని, విద్యార్థినీ, విద్యార్థుల ప్రతి ఆశ్రమ పాఠశాల, గురుకుల పాఠశాలలో హెల్త్ సిబ్బందిచే వారికి ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ ఉండాలని అన్నారు. విద్యార్థుల మెనూ, పిల్లల యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఈనెల 3 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నందున ఆశ్రమ పాఠశాలలో, గురుకులాల్లో హెచ్ఎం, ప్రిన్సిపాల్‌తో పాటు సబ్జెక్టు టీచర్లు అందరూ విద్యార్థినీ, విద్యార్థుల వెన్నంటే ఉండి తరగతి పరీక్షలు బాగా రాసేలా వారిలో స్ఫూర్తి నింపుతూ, ప్రతి పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు 10/10 రిజల్ట్ వచ్చేలా చూడవలసిన బాధ్యత సంబంధిత సిబ్బందిపై ఉందని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 39 ఆశ్రమ పాఠశాలలో 1,864 మంది, 16 వసతి గృహాలలో 278 మంది, మూడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ 37 మంది, 14 గురుకుల పాఠశాలలో 1,075 మంది, మొత్తం 72 ఇన్స్టిట్యూషన్లలో 3,254 మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 105 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయడానికి మెడికల్ బృందాలను కూడా పరీక్ష కేంద్రాల దగ్గర ఏర్పాటు చేసి, 83 వాహనాలలో విద్యార్థిని, విద్యార్థులను తరలించి పరీక్షలు రాసిన వెంటనే తిరిగి వారి పాఠశాలలో చేరుకునే విధంగా సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్, సబ్జెక్టు టీచర్లను నియమించడం జరిగిందని, పిల్లలు ధైర్యంగా పరీక్షలు రాసే విధంగా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకున్నామని తప్పనిసరిగా 10/10 రిజల్ట్ వచ్చేలా కృషి చేస్తామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతంపోట్రూ మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో (జనరల్) ఆర్సీఓ ఇంచార్జి (గురుకులం)డేవిడ్ రాజ్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి, ఏసీఎంఓ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.