Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1.93 కోట్లతో గ్రామీణ రోడ్లకు శంకుస్థాపన
నవతెలంగాణ-ఇల్లందు
దశాబ్దాలుగా సరైన రహదారులు లేక ప్రజలు అవస్థలు పడ్డారని, సీఎం కేసీఆర్ పాలనలోనే రోడ్లకు మహార్దశ వచ్చి అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. మండల పరిధిలోని మామిడి గుండాల, లచ్చగూడెం, రేపల్లెవాడ, చల్ల సముద్రం, ఒడ్డుగూడెం, ధనియాలపాడు పంచాయతీలలో డిఎంఎఫ్టి, ఎన్ఆర్ఇజిఎస్ 1.93 కోట్ల నిధులతో ఆదివారం నూతన రహదారులకు ఎంఎల్ఏ హరిప్రియ హరి సింగ్ నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా రహదారులు ఉంటాయన్నారు. పల్లె పల్లెకు రాజమార్గం ఏర్పాటు కానుందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామీణ పల్లెల రూపురేఖలు ఎంతగానో మారిపోయాయి అన్నారు. అంచలంచెలుగా గ్రామాలను అభివద్ధి చేసుకోవడంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజరు కుమార్ ప్రత్యేక దృష్టి సారించి నిధులను కేటాయిస్తున్నారన్నారు. వారికి నియోజకవర్గ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి ఉమాదేవి, వైస్ ఎంపీపీ ప్రమోద్ కుమార్, సర్పంచి సంఘాల అధ్యక్షులు కుంజ కృష్ణ, సర్పంచులు ఆలం కౌసల్య, మాడే సునీత, నూనవత్ కృష్ణ, ఎంపీటీసీలు పూణే లింగమ్మ, జయమ్మ, మండల కో ఆప్షన్ గాజి పాల్గొన్నారు.
మహర్దశ పట్టనున్న గ్రామీణ రోడ్లు
మామిడి గుండాల గ్రామపంచాయతీలో డిఎంఎఫ్టి నిధులు రూ.20 లక్షలు, ఎన్ఆర్ఇజిఎస్ నిధులు రూ. 20 లక్షలు, లచ్చగూడెం గ్రామపంచాయతీలో డిఎంఎఫ్టి నిధులు రూ. 25 లక్షలు, రేపల్లెవాడ గ్రామపంచాయతీలో డిఎంఎఫ్టి నిధులు రూ. 15 లక్షలు, ఎన్ఆర్ఇజిఎస్ నిధులు రూ. 20 లక్షలు, చల్ల సముద్రం గ్రామపంచాయతీలో నిధులు రూ. 15 లక్షలు, ఒడ్డుగూడెం గ్రామపంచాయతీలో డిఎంఎఫ్టి నిధులు రూ. 20 లక్షలు, ఎన్ఆర్ఇజిఎస్ నిధులు రూ. 20 లక్షలు, ధనియాలపాడు గ్రామపంచాయతీలో డిఎంఎఫ్టి నిధులు రూ. 18 లక్షలు, ఎన్ఆర్టిజిఎస్ నిధులు రూ.20 లక్షలతో రోడ్లు వేయనున్నారు.