Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 30 వరకు జీఓ నెంబర్ 58, 59 కింద నూతన దరఖాస్తుల ఆహ్వానం
- భూముల క్రమబద్ధీకరణకు కటాఫ్ జూన్ 02 వరకు పొడగింపు
- రాష్ట్ర పశుసంవర్ధక శాఖ,మంత్రి తలసాని, ప్రభుత్వ సిఎస్ శాంత కుమారి
నవతెలంగాణ-పాల్వంచ
గ్రామాలలో సంపద పెంచే దిశగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం రెండవ విడత కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి రెండవ విడత గొర్రెల పంపిణీ, కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76, 118 ప్రభుత్వ జి.ఓల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, పోడు భూముల పై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో ఐడిఓసి నుండి జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న గొల్లకుర్మలకు, యాదవులకు 75శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్ పంపిణీ చేయాలని నిర్ణయించిన యూనిట్ వ్యయాన్ని ప్రభుత్వం 1.25 లక్షల నుంచి 1.75 లక్షలకు పెంచిందని అన్నారు. అనంతరం కంటి వెలుగు అంశం పై రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి సమీక్షిస్తూ, జిల్లాలకు చేరిన ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు త్వరితగతిన లబ్దిదారులకు వారి ఇంటి వద్ద అందించే విధంగా కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎస్ సూచించారు. కంటి వెలుగు శిబిరాల నాణ్యత నిరంతరం పరిశీలించాలని, జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా పర్యటించాలని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమంపై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ అనుదీప్ సమీక్షిస్తూ, జిల్లాలో గొర్రెల రవాణాకు ఈ టెండర్ ప్రక్రియ పారదర్శకంగా నిబంధనల మేరకు జాగ్రత్తగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో రెండవ విడత గొర్రెల పంపిణీ పథకం క్రింద లబ్దిదారుల జాబితా పరిశీలించి, అందులో ఎవరైనా మరణించి ఉంటే నామిని వివరాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న గొల్ల కుర్మ సంఘాలు, లబ్దిదారులచే లబ్దిదారుని వాటా సేకరణ కోసం షెడ్యూల్ రుపోందించి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. కంటి వెలుగు క్వాలిటీ కంట్రోల్ బృందాలు ప్రతి రోజూ ఫీల్డ్ లెవల్ పరిశీలన చేయాలని, ఆరోగ్య మహిళ క్రింద అందించే సేవలను వివరిస్తూ అధిక సంఖ్యలో మహిళలు సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 కింద పెండింగ్ ఉన్న రుసుము చెల్లింపుల పై రెవెన్యూ డివిజన్ అధికారులు శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు. రెండు పడక గదుల ఇండ్ల లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా నిబంధనల పూర్తి చేశామని, సదరు లబ్దిదారుల జాబితా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పశు సంవర్డక శాఖ డిడి పురందర్, జిల్లా వైద్యాధికారి డా శిరీష, డిఆర్వో అశోక్ చక్రవర్తి, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవోలు స్వర్ణలత, రత్న కల్యాణి తదితరులు పాల్గొన్నారు.