Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9న హైద్రాబాద్ లో ఉమ్మడి సమావేశం
నవతెలంగాణ-అశ్వారావుపేట
భవిష్యత్తులో సీపీఐ - సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని, ఇందుకోసం ఈ నెల 9 న హైద్రాబాద్ లో రెండు పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహిస్తున్నామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య తెలిపారు. ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి ఆగ్జలరి గ్రూపు సభ్యులు సమావేశం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం అయిన సుందరయ్య భవన్ లో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన కనకయ్య పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. పెట్టుబడిదారులకు కొమ్ము కాసే పాలకులను ఎదుర్కోవాలంటే ప్రజలను ఐక్యం చేసి ఉద్యమాలు చేయాలంటే వామపక్ష పార్టీలు ఐక్యత అత్యవసరం అని, ముఖ్యంగా సీపీఐ - సీపీఐ(ఎం) ఉమ్మడి పోరాటాల ఆవశ్యకతను వారు వివరించారు. ఇందుకోసం హైద్రాబాద్ లో రెండు పార్టీల అగ్రనాయకులు సమావేశం అయి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అన్ని మండలాల మండల కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అర్జున్, బి.చిరంజీవి, దొడ్డ లక్ష్మినారాయణ, నియోజక వర్గం మండలాల కార్యదర్శులు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.