Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణపు వెంకటేశ్వరరావు
నవ తెలంగాణ - బోనకల్
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గత ఎనిమిది ఏళ్లుగా దేశంలో అమలు చేస్తున్న కార్పొరేట్, మతోన్మాద అనుకూల విధానాలను, రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణం విరమించుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణపు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. చలో ఢిల్లీ గోడపత్రికలను ఆదివారం సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అఖిలభారత సంఘాల పిలుపులో భాగంగా రాష్ట్రంలో సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామస్థాయి నుండి మండల, జిల్లా కేంద్రాల వరకు విస్తత ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీన చలో పార్లమెంటు కార్యక్రమం సందర్భంగా నిర్వహించనున్న ఢిల్లీ మజ్దూర్ కిసాన్ సంఘర్షణ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. కార్మికుల హక్కులు, కార్మిక చట్టాల రక్షణ, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు, విద్యుత్ సవరణ బిల్లు - 2022 ఉపసంహరణ, మాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు, పని దినాలు 200 రోజులకు పెంచి, కనీస వేతనం రూ.600 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలను నియంత్రించడం, రైతు పండించే అన్ని ఉత్పత్తులకు కనీసం మద్దతు ద్వారా నిర్ణయించి కొనుగోలను గ్యారెంటీ చేయాలని, ఒకేసారి కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేసి 60 ఏళ్లకు పైబడిన వారందరికీ పెన్షన్ అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో బిజెపి ప్రకటించిన అభివద్ధి నినాదం కారు మబ్బులా కరిగిపోయిందని విమర్శించారు. బిజెపి పరిపాలనలో దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి సవాల్ ఎదురైందన్నారు. కనీస వేతనం 26 వేల, పెన్షన్ రూ. 10,000 అందరికీ చెల్లించాలని, ప్రజలకు నష్టం కలిగించే స్కీములు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్యారెంటీతో కూడిన సేకరణతో పాటు అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఉండేలా చట్టబద్ధత కల్పించాలని కోరారు. ధరల పెరుగుదలను అరికట్టాలని, ఆహార వస్తువులు, నిత్యవసర సరుకులపై జిఎస్టి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నాణ్యమైన ఆరోగ్యం, విద్యను అందించడం, జాతీయ విద్యా విధానం 2022ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధనవంతులపై పన్నును విధించాలని, కార్పొరేట్ పన్నులు పెంచాలని, సంపద పన్నును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టం కఠినంగా అమలు చేయాలని, అటవీ పరిరక్షణ చట్టం యొక్క సవరణలు, నిబంధనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలపై భారాలు మోస్తూ పెట్టుబడిదారుల కార్పొరేట్ సంస్థలకు ప్రజా సొమ్మును కారుచౌకగా కట్టబెడుతుందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం మతోన్మాదం పేరుతో పరిపాలన చేస్తూ దేశాన్ని నాశనం చేసే పరిపాలన చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, మండల ఉపాధ్యక్షుడు షేక్ ఖాదర్ బాబా భవన నిర్మాణ కార్మికులు జంపాల సాంబయ్య, షేక్ బాజీ, నరెడ్ల వెంకటి, మల్లెల గోపి, జంపాల నరసింహారావు, ఆర్ కన్నయ్య, ఎర్రగాని నాగేశ్వరరావు, బంధం వెంకటేశ్వర్లు, షేక్ సత్తార్ పాల్గొన్నారు.