Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ అభ్యర్థులను ఓడించింది నువ్వు కాదా..
- మాజీ ఎంపీ పొంగులేటిపై తాతా మధు విమర్శలు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత పొంగులేటికి లేదని, కెసిఆర్, కేటీఆర్ దగ్గర జిల్లాలో అత్యధికంగా లబ్ధి పొందిన వాళ్లలో మొట్ట మొదటి వాడివి ఆయనేనని, ఐదేండ్లు ఎంపీగా ఉండి జిల్లాకు మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏం చేశాడని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు తాత మధుసూదన్ ఘాటుగా విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఎర్రుపాలెం మండల పరిధిలోని జమలాపురం బాలాజీ భవనం నందు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాత మధు మాట్లాడుతూ గత శాసన సభ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థులను పోటీలో దించి పార్టీ అభ్యర్థులను ఓడించింది అతను కాదా అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టుకు బడ్జెట్ లో నిధులు లేవని ప్రభుత్వాన్ని విమర్శించే పొంగులేటి 400 కోట్ల రూపాయలకు టెండర్ ఎందుకు వేశాడని ప్రశ్నించారు. మధిరలో అన్ని ఎన్నికలలో టిఆర్ఎస్ గెలుస్తూ వస్తున్నా ఎమ్మెల్యే విషయంలో ఎందుకు ఓడిపోతున్నామో ఆత్మ విమర్శ చేసుకోవాలని కార్యకర్తలకు హితవు పలికారు.
ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద కుటుంబమని, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుంటూనే ఉంటాయని, అందరూ కలసి కూర్చోని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారామవుతాయని అన్నారు. కేంద్రం ప్రతి విషయం లోనూ తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని దుయ్య బట్టారు. రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధిలో, నిధుల మంజూరులో కేసీఆర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. జెడ్పీ చైర్మెన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రూ.10వేలను అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. టీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పదవులు అనుభవించి, పార్టీ పేరు చెప్పుకుని సంపాదించుకున్న కొంత మంది నాయకులు ఎన్నికల సమయానికి పార్టీ మారుతున్నారని, వారెవరైనా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని, వాళ్లు పార్టీ నుండి వెళ్లి పోవచ్చని ఉద్వేగంగా మాట్లాడారు. పదవులు శాశ్వతం కాదని పార్టీయే శాశ్వతమని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మధిరలో గులాబీ జెండా ఎగర వేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, ఎంపీపీ దేవరకొండ శిరీష, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ ,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పంబి సాంబశివ రావు, శ్రీనివాసరెడ్డి, స్థానిక సర్పంచ్ మూల్పూరి స్వప్న, మూల్పూరి శ్రీనివాసరావు, నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.