Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిపాజిట్ రానోళ్లు విమర్శించడం హాస్యాస్పదం
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- గంగారంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ- సత్తుపల్లి
తెలంగాణ రాకముందు, వచ్చాక ఈ తొమ్మిదేండ్ల కాలంలో జరిగిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను గ్రామగ్రామాన ప్రజలకు గులాబీ శ్రేణులు అర్థమయ్యేలా వివరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం సత్తుపల్లి మండలం గంగారం వాసు గార్డెన్స్‌లో ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో తొలి విడత 11 గ్రామపంచాయతీల బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ సభకు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, డీసీసీబీ ఛైర్మెన్ కూరాకుల నాగభూషణం అతిథులుగా హాజరయ్యారు. ఈ సభలో సండ్ర గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధి తెలిసి కూడా రాజకీయ లబ్దికోసం ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నారని సండ్ర అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సత్తుపల్లిలో పోటీచేసిన నీకు డిపాజిట్టు కూడా రాలేదని, డిపాజిట్ రాని నీవు సైతం నన్ను విమర్శించడం అంటే అకాశంపై ఉమ్మేస్తే మొఖంపై పడిన చందాన ఉందని సండ్ర ఉద్వేగంగా విమర్శిలను తిప్పికొట్టారు. మరొకాయన కోడిపందేలు, టెండర్లంటూ తనపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కోడి పందేలకు వెళ్లడం తెలియదని, టెండర్లు వేసేందుకు వెళ్లిన దాఖలాలు లేనేలేవని, ఆల్కహాలు తీసుకొనే అలవాటు కూడా నాకు లేదని, తాగితందనలాడుతూ, కోడిపందేలు ఉన్న మీ వీడియో క్లిప్పింగులు నా దగ్గర ఉన్నాయని, చూపించమం టారా అంటూ విమర్శకులపై సండ్ర ధ్వజమెత్తారు. మరొకరు సీతారామ రాదని విషప్రచారం చేస్తూనే ఆ ప్రాజెక్టు పనులు దక్కించుకొనేందుకు టెండర్లు వేయడానికి వెళ్తాడని దుయ్యబట్టారు. ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా, కుతంత్రాలు పన్నినా, కాళ్లు పైకెత్తి నేలకు తలకు రాసుకున్నా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని ఆపేశక్తి ఎవరికీ లేదని సండ్ర కుండబద్దలు కొట్టారు.
నీతి, నిజాయితీ సండ్ర సొంతం : ఎంపీ బండి
నీతి, నిజాయితీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సొంతమని, ఆయన ఆయన తప్పుడ విధానాలను అవలంభిస్తాడని గత రెండు దశాబ్దాలకు పైగా నా చెవిన పడలేదని, ఎంతో నిబద్ధత కలిగిన ఎమ్మెల్యే సండ్ర అని రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి అన్నారు. ఆదివారం గంగారంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభలో బండి పాల్గొని ప్రసంగించారు. క్రమశిక్షణతో ఉండే స్వభావం, ఏ కార్యక్రమం చేపట్టినా అది నూరుశాతం సక్సెస్ అయ్యేందుకు ఆయన చేసే కృషి అభినందనీయమన్నారు. తప్పడు రాజకీయాలు చేయడం లాంటివి కనీసం ఆయన దరిదాపుల్లో ఉండవన్నారు. పలానా చెడ్డపని చేశాడని నేనే కాదు మీరు కూడా ఎప్పుడూ వినివుండరని డాక్టర్ బండి స్పష్టం చేశారు. మా అమ్మగారి పేరుతో నా స్వగ్రామమైన కందుకూరులో జూనియర్ కళాశాల నిర్మాణం జరుగుతుండగా అట్టి నిర్మాన పనులను సండ్ర స్వయంగా వెళ్లి పనులను పర్యవేక్షించడం చాలా సంతోషం కలిగిందని బండి అన్నారు. సండ్ర మనకు ఎమ్మెల్యే కావడం మనందరి అదృష్టంగా భావన కలుగుతోందని బండి అన్నారు.
సండ్ర మూడుసార్లు గెలవడం అసాధారణం : వద్దిరాజు
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ సత్తుపల్లి ఎమ్మెల్యేగా సండ్రను మూడుసార్లు గెలిపించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డును ఇక్కడి ప్రజలు ఇవ్వడం అసాధారణమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎందుకంటే ఒకసారి గెలిచిన వారిని ఆ తరువాత ఓడించడం సత్తుపల్లి సంప్రదాయం కాగా ఆ సంప్రదాయాన్ని సండ్ర మంచిపనులతో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని రవిచంద్ర అన్నారు. సత్తుపల్లిలో పోటీచేసేందుకు ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ఇక్కడి అభివృద్ధిపై ముద్రించిన కరపత్రాలను చూపిస్తే చాలు కరపత్రాన్ని చూసిన రోజే నైతికంగా ఓటమి పాలవడం ఖాయమన్నారు. బీజేపీ నాయకులు ఖమ్మంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారని, మన జిల్లాలో బీజేపీకి స్థానం లేదని వద్దిరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ ఛైర్మెన్ వనమా శ్రీనివాసుదేవరావు, డీసీఎంఎస్ ఛైర్మెన్ శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, 11 గ్రామ పంచాయతీల సర్పంచులు, గులాబీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.