Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీతారామ ప్రాజెక్టులోనే సీతమ్మ సాగర్ భాగం అంటున్న అధికారులు
- ఈ నెల 26న విచారణ
నవతెలంగాణ-మణుగూరు
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదారి జలాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అశ్వాపురం మండలం కుమ్మరి గూడెంలో సీతమ్మ సాగర్ బహులార్ధక సాధక ప్రాజెక్టు (సీతారామ ప్రాజెక్ట్) పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పనులను నిలిపి వేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నారంటూ తెల్లం నరేష్, బి.లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పుష్ప సత్యనారాయణ జ్యుడీషియల్ సభ్యుడు డాక్టర్ కొర్లపాటి సత్య గోపాలతో కూడిన ధర్మాసనం విచారించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టవద్దని పనులకు ఎలాంటి అనుమతులు ఉన్నాయో ఈనెల 26 వరకు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ విచారణను 26కు వాయిదా వేశారు. అయితే ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన బ్యారేజ్ పనులు మాత్రం ఆగలేదు.
కొనసాగుతున్న పనులు
దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన 200 మీటర్ల దూరంలో సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మిస్తున్నారు. ఈ బ్యారేజీ ద్వారా 37.5 టీఎంసీల నీరు నిలువ చేయనున్నారు. బ్యారేజ్‌కి అనుబంధంగా 320 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టి 2020లో పనులు ప్రారంభించింది. 2022 సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం కాగా 2023 మార్చి వరకు గడువు పొడిగించారు. ప్రభుత్వం మొదట 3 వేల కోట్లతో పనులు చేపట్టగా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 5 వేలకోట్లు అవుతుందని అంచనా మొత్తం ఆరు బ్లాకులు కాగా ఐదు బ్లాక్‌లో ఫియర్ల నిర్మాణం సాగుతుంది. ఆరు బ్లాకుల్లో 68 గేట్లు అమర్చనున్నారు. వేసవికాలం పూర్తయ్యే జూన్ వరకు గేట్లు అమర్చే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. ఈ బ్లాక్‌కు అనుబంధంగా 320 మెకావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మించనుండగా ప్రభుత్వం అనుమతి రాలేదు. ప్రాజెక్టు కోసం 3,267 ఎకరాలు సేకరించగా కరకట్ట నిర్మాణం కోసం అశ్వాపురం, మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో మరో 500 ఎకరాలు సేకరించనున్నారు.
సీతారామలో భాగమే
రాష్ట్ర ప్రభుత్వం 13వేల కోట్ల అంచనాలతో ఏడేళ్ల క్రితం సీతారామ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. సీతారామ ప్రాజెక్టులోనే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ఒక భాగమని సీతారామ ప్రాజెక్టుకు మంజూరైన పర్యావరణ అనుమతులు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు వర్తిస్తాయని జల వనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గోదావరి బోర్డు, ఎన్జీటీ సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు రెండు వేరు వేరు అని, సీతమ్మ సాగర ప్రాజెక్టుకు అన్ని అనుమతులు పొందాలని జల వనరుల శాఖకు సూచించినట్లు సమాచారం. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న భూమి ముంపునకు గురయ్యే భూమిని ఏ మేరకు సేకరించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న భూమి గుంపునకు గురయ్యే భూమిని ఏ మేరకు సేకరించారు? సీతారామ ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతులకు ప్రస్తుత సీతమ్మ సాగర ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మధ్య వ్యత్యాసాన్ని వివరించాలని ప్రాజెక్టుకు పది కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పార్కు లేదని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ద్వారా దృవీకరణ ప్రాజెక్టు డీపీఆర్ఓను సమర్పించాలని కమిటీ ఆదేశించింది. ఇప్పటివరకు పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నారని తెల్లం నరేష, లక్ష్మీనారాయణ గ్రీన్ చిగుళ్ళను ఆశ్రయించగా సీతమ్మసాగర్ బహుళ అర్థక సాధక ప్రాజెక్టును పర్యావరణ అనుమతులు పొందాలని అనుమతులు వచ్చాక పనులు చేపట్టాలని ప్రస్తుతం నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి ఆదేశించింది.
ఎన్జీటీలోనే ఫైల్ రిఫర్ చేస్తా
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లోనే నివేదిస్తాం, ప్రాజెక్టు పూర్తి వివరాలతో వారు కోరిన సమాచారంతో ఈనెల 26న హాజరవుతాం. ఎన్జీటీ ఆదేశాలతో పనులను నిలిపివేశాం. సీతారామ ప్రాజెక్టులోనే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ఒక భాగం.
- జల వనరుల శాఖ ఎస్.ఈ.శ్రీనివాస్ రెడ్డి