Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతంలో అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో పనులు జరిగినాయి
- ఎవరు ఒత్తిడి మేరకు అదనపు కలెక్టర్ పర్యవేక్షణ తగ్గింది
నవతెలంగాణ-వైరాటౌన్
వైరా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపైన స్వతంత్ర సంస్థతో సమగ్ర దర్యాప్తు చేయాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ సమావేశం బోడపట్ల రవీందర్ అధ్యక్షతన స్థానిక బోడేపూడి భవనం నందు జరిగింది. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీలో కొంతకాలంగా అనేక అవినీతి, అక్రమాల ఆరోపణలు వస్తున్న అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదని, కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా, వైరా మున్సిపాలిటీ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ప్రజలను జలగలాగా పీల్చుకుంటు న్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధన లను తుంగలో తొక్కి పాలకవర్గం పరిపాలన చేస్తుందని ప్రతిరోజు ప్రచార మాధ్యమాలలో వైరా మున్సిపాలిటీ పైన అనేక అవినీతి అక్రమాల వార్తలు వస్తున్నా ప్రభుత్వ అధికారులు సోద్యం చూస్తున్నారని అన్నారు. అక్రమాలకు అడ్డాగా మారిన వైరా మున్సిపాలిటీ పైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టి సమగ్ర దర్యాప్తు చేసి అక్రమాలను అరికట్టాలన్నారు. దోషులుగా తేలిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, వైరా మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ చెరువులు, మంచినీటి బావులు, వాటర్ ట్యాంక్ స్థలాలు ఆక్రమణలు జరిగాయని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ(ఎం) పార్టీ వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, బొంతు సమత, హరి వెంకటేశ్వరావు, పైడిపల్లి సాంబశివరావు, అనుమోలు రామరావు, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహన్ రావు, సంక్రాంతి నరసయ్య, గుమ్మా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.