Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
ఖమ్మం జిల్లాలో రైతులు పత్తి, వరి పంటల సాగు తర్వాత అత్యధికంగా పెసర సాగు చేశారని అట్టి పెసరకు మారుకో మచ్చల పురుగు ఆశించి పంటను నష్ట పరుస్తున్నట్లు వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ జే.హేమంత కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
లక్షణాలు
ఈ పురుగు పంట పూత దశలో పువ్వులను, గూడు చేసుకుని రసాన్ని పీలుస్తుందని, కాయ తయారయ్యే దశలో కాయలను గూడుగా చేసుకుని గింజలను తిని పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు.
యాజమాన్య పద్ధతులు
పూత దశలో తప్పని సరిగా పైరుపై 5శాతం వేప గింజల కషాయం, లేదా వేప నూనె ( 1500 పిపిఎం )5 మి.లీ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేస్తే రెక్కల పురుగు గుడ్లు పెట్టటానికి ఇష్టపడవు అని తెలిపారు. అంతే గాక పంట మొక్కలపై అప్పటికే ఉన్న గుడ్డు పగిలి పోయి చనిపోతుందని తెలిపారు. మొగ్గ పూత దశలో అక్కడక్కడ కొన్ని మొగ్గలను సేకరించి విప్పి చూసి పిల్ల పురుగులు ఉన్నాయేమో గమనించాలి. పిల్ల పురుగులు ఉన్నట్లు గమనించినట్లైతే వెంటనే క్లోరి పైరిపాస్ 2.5 మి.లీ లేదా ధయోడి కార్బ్ 1 గ్రాముల లేదా విస్పెట్ 1.5 గ్రాముల ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. పంటలో గూళ్ళు గమనించితే ఎసిపెట్ 1.5 మి. లీ లేదా క్వినాల్ పాస్ 2 మి.లీ లేదా క్లోరీ పైరి పాస్ లీటరు నీటికి కలిపి మందును మార్చుతూ 2, 3 సార్లు పూత, కాయ పిచికారి చేసుకోవాలని కోరారు. పురుగు ఉధృతంగా ఉన్నట్లు గమనిస్తే సైనో నీడ్ 0.3 మి.లే, విమోమెక్టిన్, బెంజో యెట్ 0.4 మి.లీ, లేదా ప్లూ బెండి మైడ్ 0.2 మి.లీ లేదా క్లోరా ట్రాసిలి ప్రోల్ 0.3 మి. లీ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని కెవికె వ్యవసాయ శాస్త్ర వేత్తలు కె రవికుమార్,జే హేమంత్ కుమార్ తెలిపారు.
వరి పంటలో కాండం తొలిచే పురుగు, మెడ విరుపు లక్షణాలు
ఖమ్మం జిల్లాలో యాసంగిలో 2.14 లక్షల ఎకరాలలో వరి సాగు చేశారు. ప్రస్తుతం వరి చిరుపొట్ట, ఈనే దశలో ఉన్నదని, కొన్ని ప్రాంతాలలో కాండం తొలిచే పురుగు, మెడ విరుపు గమనించినట్లు కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ జే హేమంత్ కుమార్ తెలిపారు. 1, కాండం తొలిచే పురుగు.. తొలి దశలో కాండం తొలిచే పురుగు ఆశిస్తే మొవ్వులు ఎండి పోవటం గమనించవచ్చన్నారు. చిరు పొట్ట దశలో కాండం తొలిచే పురుగు ఆశిస్తే తెళ్ళకంకి కావటం, తాలుగా మారటం జరుగుతుందన్నారు. చిరు పొట్ట దశలో కాండం తొలిచే పురుగు నివారణకు కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 400 గ్రా, లేదా క్లోరాం క్రోసిల్ ప్రొల్ 60 మి. లీ, లేదా తెట్రాసిలి ప్రిల్ 80 మి.లీ ఎకరానికి పిచికారి చేయాలని సూచించారు
2. మెడ విరుపు..
ప్రస్తుతం గాలిలో తేమ అధికంగా ఉండటం, వర్షాలు కురవడం వలన అగ్గి తెగులు ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున తెగులు ఉధృతిని గమనిస్తూ నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. వరి చిరు పొట్ట దశలో ఉన్నప్పుడు అగ్గి తెగులు ఆశించినట్లు గమనిస్తే ఆఖరి దఫా వేసే నత్రజనిని ఆపాలని కోరారు. సుంకు దశలో, కంకి పాలు పోసుకునే దశలో అగ్గి తెగులు గమనించినట్లైతే ఎకారానికి ట్రై సైక్లో జోల్ మ్యాంకో జెబ్ 500 గ్రా,లేదా ఐసో ప్రోధయోలెన్ 320 మి.లీ, లేదా కాసుగా మైసిన్ 500 గ్రాము, పిచికారి చేయాలి. ఉధృతంగా ఉన్నట్లయితే ట్రైప్లోక్సీ స్ట్రోబిన్, టెబుకొనిజోల్ 80 గ్రాము లేదా పికాక్సి స్త్రోబిన్, ట్రై సైల్లో జోల్ 400 మి.లీ, లేదా అజాక్సీ స్ట్రోబిన్, డైఫెన్ కొనజోల్, 200 మి.లీ ఎకరానికి పిచికారి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు కె రవికుమార్, జే హేమంత్ కుమార్ తెలిపారు.