Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలంలో ఎంత ప్రాంతం మునుగుతది, మునిగిన ప్రాంతానికి నష్టపరిహారం చెల్లించే బాధ్యత ఎవరిది, ముంపుని నివారించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసిన కర్తవ్యం ఏమిటీ వంటి ఎన్నో ప్రశ్నలు సమాధానం లేకుండానే మిగిలిపోతున్నాయి. ఒకపక్క ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్ట్ శరవేగంగా పూర్తి అవుతున్న నేపథ్యంలో భద్రాచలం భవిష్యత్తుపై సర్వంత ఉత్కట నెలకొన్న విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై.. తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యంతో ఉమ్మడి సర్వే చేపట్టాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆదేశించింది. సోమవారం న్యూఢిల్లీలో సిడబ్ల్యుసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఉమ్మడి సర్వేపై ముందుకు వెళ్లడంపై ఏప్రిల్ 10న తెలంగాణ, ఏపీతో సమావేశం నిర్వహించాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సిడబ్ల్యుసి ఆదేశించింది. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ చైర్మన్ కుష్వీందర్ వోహ్రా అధ్యక్షత వహించారు. తెలంగాణ ఇంజనీర్-ఇన్-చీఫ్ బి.నాగేందర్ రావు నేతృత్వంలో, చీఫ్ ఇంజనీర్ (కొత్తగూడెం) ఎ.శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్ డ్యూటీ అధికారి శ్రీధర్ రావు దేశ్ పాండే, అంతర్ రాష్ట్ర బోర్డు డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత కూడా ముంపు ప్రాంతాల ఉమ్మడి సర్వే ఆలస్యం కావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జులై 2022 గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని కూడా ఉమ్మడి సర్వేను అసమంజసమైన వాదనతో జాప్యం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. పోలవరం పూర్తిస్థాయి రిజర్వాయర్ స్థాయిలో తెలంగాణలో మునిగిపోయే ప్రాంతాలను కూడా గుర్తించాలని తెలంగాణ అధికారులు బలంగా తమ వాదనను వినిపించారు. భద్రాచలం పట్టణంలోని ఎనిమిది అవుట్‌ఫాల్ రెగ్యులేటర్ లెవెల్స్‌ను గుర్తించడంతో పాటు, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, చారిత్రక భద్రాచలం ఆలయానికి వరద రక్షణ చర్యలు చేపట్టాలని, కిన్నెరసాని, ముర్రేడువాగుతో సహ మరో 6-7 వాగుల్లో బ్యాక్ వాటర్ ప్రభావంపై సర్వే నిర్వహించి, ముంపు ప్రాంతాలను గుర్తించాలని తెలంగాణ అధికారులు కోరారు. అన్ని సమస్యలు పరిష్కరించే వరకు తగిన రక్షణ చర్యలు తీసుకునే వరకు పోలవరం ప్రాజెక్టులో నీటిని నిలువ చేయవద్దని తెలంగాణ అధికారులు తమ వాదన బలంగా వినిపించారు. సిడబ్ల్యూసి ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు పాటిస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు తప్పదని తెలంగాణ రాష్ట్ర వాదనను సిడబ్ల్యుసి పరిణయం తీసుకోవడం ఈ మేరకు ఉమ్మడి సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేయడం భద్రాచలం వాసులో కొంత ఉత్సాహాన్ని కల్పిస్తున్న అంశం వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని భద్రాచల పట్టణవాసులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై రాజీ పడకుండా తన పోరాటాన్ని కొనసాగించాలని వివిధ రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. మొదటి నుండి భద్రాచలం ముంపు పై ద్వంద వైఖరి అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం సర్వే నిష్పతంగా నిర్వహించి ముంపు నివారణ చర్యలు చేపడుతుందా లేక భద్రాద్రి రామయ్యను గోదావరిలో ముంచేందుకే సిద్ధమవుతుందా వేచి చూడాలి. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కనుక ముంపులో కలిగే నష్టాన్ని కూడా కేంద్రం భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భద్రాచలం ఉండేందుకు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడంతో పాటు భద్రాచల పట్టణంలోని కరకట్టని ఎత్తు వెడల్పు పెంచి కలకత్తా ప్రతిష్ట పెంచాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉంది. గతంలో సీపీఐ(ఎం) చెప్పిన విధంగానే అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకు వచ్చి కేంద్రంపై పోరాటం చేస్తే తప్ప పోలవరం రాకాసి కోన నుండి భద్రాచలం బయటపడే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.