Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన వారిని గుర్తించాలని ఆదేశం
- నష్టపరిహారం అందేలా చూడాలి : ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఇల్లందు
ఇటీవల కురిసిన భారీ వడగండ్ల వానకు నష్టపోయిన, పాడైన పంటలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ మంగళవారం పరిశీలించారు. మాణిక్యారం, కోమరారం, మసివాగు, తుంటబాలు తండా, బోయితండాలలో దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, టమాటా, పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల కురిసిన వడగండ్ల వాన, గాలి దుమారాలకు పంటలు పాడైన విధాన్ని నష్టాన్ని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో కలెక్టర్ పంట నష్టపోయిన అర్హులైన వారందరి పేర్లు నమోదు చేయాలని డీఏఓ అభిమన్యుని ఆదేశించారు. మొక్కజొన్న, వరి, టమాట పంటలతో పాటు మామిడి పంటలకు కూడా పరిహారం అందేలా చూడాలని మామిడి సాగు రైతులు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేని కోరారు. స్పందించిన కలెక్టర్ ఏ పంట నష్టపోయినా అధికారులు నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం బోయి తండాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. కొమరారం ప్రాథమిక వైద్యశాలను సందర్శించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్యాన్ని సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జిల్లా రైతు సమన్వయ సభ్యులు పులిగండ్ల మాధవరావు, జడ్పీటీసీ ఉమ దేవి, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో అప్పారావు, ఏవో సతీష్, ఏడీఏ వాసవి రాణి, డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, వైస్ ఎంపీపీ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.