Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అతి పెద్దదైన కొత్తగూడెం న్యాయవాద సంఘం అధ్యక్షుడిగా రమేష్ కుమార్ మక్కడ్ మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. కోర్టు ఆవరణంలోని లైబ్రరీ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతోపాటు నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు చేపట్టింది. ఉపాధ్యక్షునిగా దుండ్ర రమేష్, ప్రధాన కార్యదర్శిగా రావిలాల రామారావు, సంయుక్త కార్యదర్శిగా కాసాని రమేష్, కోశాధికారిగా సంతోష్ లాల్ సాహు, క్రీడా కార్యదర్శిగా పిట్టల రామారావు, గ్రంథాలయ కార్యదర్శిగా యాస యుగంధర్, మహిళ ప్రతినిధిగా ఏ.మనోరమ కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన వారికి సీనియర్ న్యాయవాది వట్టికొండ సురేష్ బాబు చేతుల మీదుగా ఎన్నికల అధికారి పలివెల సాంబశివరావు ధృవీకరణ పత్రాలను అందజేశారు. నూతనంగా బాధ్యతలను స్వీకరించిన సభ్యులను పాత కమిటీ వారు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన కార్యవర్గానికి కొత్తగూడెం బార్ అసోసియేషన్ సంబంధించిన అన్ని రికార్డులను, గత కార్యవర్గం, నూతన కార్యవర్గానికి స్వాధీనపరిచారు. న్యాయవాదులను ఉద్దేశించి రమేష్ కుమార్ మక్కడ్ మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి అన్ని విధాలుగా అహర్నిశలు శక్తివంచన లేకుండా పనిచేస్తానని, తమ కార్యవర్గ సభ్యులు అందరికీ అన్ని వేళల్లో అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తారని తెలిపారు. న్యాయవాదులకు హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నించి గృహ సమస్య పరిష్కారానికి, న్యాయవాదులందరికి హెల్త్ కార్డులు వచ్చే విధంగా పనిచేస్తామని, సభాము ఖంగా తెలుపుతూ, కొత్తగూడెంలోని న్యాయ వాదులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో గత ఏడాది అధ్యక్షుడిగా పనిచేసిన అనుబ్రోలు రాంప్రసాద్ రావుతో పాటు గత కార్యవర్గం సభ్యులు భాగం మాధవరావు, మునిగడప వెంకన్న, సాదిక్ పాషా, ఆర్తి మక్కడ్, కె.శ్రీధర్, గాదె సునంద, సీనియర్ న్యాయవాదులు జలసూత్రం శివరాం ప్రసాద్, ఉదయ భాస్కర రావు, రేపాక వెంకటరత్నం, రవిచంద్ర, కె.పుల్లయ్య, లక్కినేని సత్యనారాయణ, యువ న్యాయవాదులు పాల్గొన్నారు.