Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఎస్పి రాష్ట్ర అద్యక్షులు పూనెం శ్రీనివాస్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనేతరులుగా చలామణి అవుతున్న బోయ, వాల్మీకి, బెంతు కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఎస్పి రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం సింగవరం గ్రామంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నూప సీతయ్య అధ్యక్షతన జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఇతర కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆమోదం తెలిపిన గిరిజన ఎమ్మెల్యేల వైఖరిని ఆయన ఈ సందర్భంగా ఖండించారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం వలన అసలైన ఆదివాసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ జాతి, చట్టాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని జాతి మేల్కొనాలని అన్నారు. సమావేశంలో జాతీయ సలహాదారు కొర్సా వెంకటేశ్వర్లు, ఏటిఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి జయబాబు, రాష్ట్ర నాయకులు కొమరం నాగయ్య, ఏఎస్పి రాష్ట్ర ఉపాధ్యక్షులు సోయం కామరాజు, జిల్లా అద్యక్షులు తెల్లం నర్సింహారావు, డివిజన్ అద్యక్షులు సోంది మల్లూరు, వెంకటేష్, అల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.