Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భద్రాచలం
స్వార్థ రాజకీయాల కోసం పదో తరగతి పేపర్ లీకేజీ చేసి విద్యార్థుల జీవితాలతో చలగాటలాడుతున్న బిజెపిని రాష్ట్రంలో, దేశంలో లేకుండా తరిమికొట్టాలని సిపి(ఐ)ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం చందర్రావు భవనంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేపర్ లీకేజీకి పాల్పడ్డారని విమర్శించారు. బిజెపి అధికారంలోకి రావడానికి ఎంతటి నీచ రాజకీయాల కైనా బరితెగిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నెలకొన్న ప్రభుత్వాలను కూల్చడంతో పాటు ఈడి దాడులు, సిబిఐ దాడులు చేయించటం వంటి నీచ రాజకీయాలు చేసే బిజెపి ఇప్పుడు విద్యార్థులతో కూడా ఆటలాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ విద్యార్థుల జీవితాలను నాశనం చేయాలని చూస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. పేపర్ లీకేజ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని ఆయన హితువు పలికారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు మర్లపాటి రేణుక, సున్నం గంగా, నాయకులు సోయం జోగారావు,రవి తదితరులు పాల్గొన్నారు.