Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేపర్ల లీకేజీ ఆరోపణలతో అప్రమత్తం
- విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు
- కలెక్టర్ సహా అధికారులు 21 కేంద్రాల సందర్శన
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పదో తరగతి పేపర్ లీకేజీల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ద్వితీయ భాష (ఇంగ్లీషు) పరీక్ష సందర్భంగా కేంద్రాలను అధికారులు గురువారం విస్తతంగా సందర్శించారు. 103 కేంద్రాల్లో ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. నగరంలోని నాలుగు పరీక్ష కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి మూడు, మధుసూదన్ ఆరు, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ ఆరు, ప్రభుత్వ పరీక్షల సహాయ సహాయ కమిషనర్ రెండు పరీక్ష కేంద్రాల చొప్పున తనిఖీ చేశారు.
పకడ్బందీగా పరీక్షలు : కలెక్టర్ వీపీ గౌతమ్
పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశించారు. నగరంలోని నయాబజార్, రిక్కా బజార్ హైస్కూల్స్, ఖాజీపుర ప్రభుత్వ హైస్కూల్, రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి, వేసవి దష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ తో లోనికి ఎవ్వరిని అనుమతించవద్దని, డిఇఓ, చీఫ్ సూపరింటెండెంట్ ల నుండి పరీక్షా విధుల్లో ఉన్న అందరినీ, చివరకు వైద్య శిబిరాల్లోని సిబ్బందితో సహా ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేసి అనుమతించాలన్నారు. ప్రహరీ గోడలు సరిగా లేనిచోట భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ వెంట ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, ఇతర అధికారులు ఉన్నారు.
63 మంది గైర్హాజరు..
ఇంగ్లీష్ ఎగ్జామ్ కు 63 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 16, 847 మందికి గాను 16,784 మంది పరీక్ష రాశారు. పలు చోట్ల పేపర్ లీకేజీల నేపథ్యంలో పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా అధికారులు గురువారం 21 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయటం గమనార్హం.