Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్నాహక సమావేశంలో విజయవంతానికి నేతల పిలుపు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
విద్యుత్ ఉద్యోగులు ఈనెల 17న సమ్మెకు సమాయత్తం కావాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈజేఏసీ) నేతలు పిలుపునిచ్చారు. సమ్మెకు సన్నద్ధం చేస్తూ ఉమ్మడి జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఖమ్మంలోని రామ్‌లీలా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో టీఎస్పీఈజేఏసీ నేతలు మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ, 2004 వరకు పెన్షన్ సౌకర్యం, ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్ వర్కర్లు, బిల్లు కలెక్టర్లు, పీస్ రేట్ కార్మికులు, ఇతర కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నిర్వహించే ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా జేఏసీ నేతలు కోరారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నా యాజమాన్యం తాత్సారం చేస్తోందని ధ్వజమెత్తారు. పైగా ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని 25 విద్యుత్ సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మెకు పూనుకుంటున్నట్లు చెప్పారు. ఈపీఎఫ్, జీపీఎఫ్, ఇతర సాధారణ సమస్యలు కూడా పరిష్కరించడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రస్తుత వేతన సవరణ ఒప్పందం గత నెల 31వ తేదీతో ముగిసిన దృష్ట్యా నూతన వేతన ఒప్పందం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఏడాది కాలంగా ఈ అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా స్పందించట్లేదన్నారు. మార్చి 29న సంస్థ యాజమాన్యం చర్చలకు పిలిచిందని, దానిలో ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవన్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 17వ తేదీన సమ్మె నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సమ్మె విజయవంతానికి 3వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు సమ్మెను విజయ వంతం చేయాల్సిందిగా పిలుపు నిచ్చారు. ఖమ్మంలో నిర్వహించిన ఈ సన్నాహక సమావేశానికి ఉద్యోగులు భారీగా హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లా ఉద్యోగులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో జేఏసీ కేంద్ర కార్యవర్గ నాయకులు రత్నాకర్‌రావు, ఇనుగాల శ్రీధర్, వజీర్, వెంకన్నగౌడ్, శ్రీనివాస్, వేణుగోపాల్, విజరు, సంపత్‌రెడ్డి, ఈశ్వర్‌గౌడ్, నాగరాజు, కల్వల సత్యనారాయణ రావు, జి.రవీందర్, ఎన్పీడీసీఎల్ కార్యవర్గ సభ్యులు శేషగిరిరావు, మహేందర్‌రెడ్డి, సౌమ్యానాయక్, ముత్తేమాల ప్రసాద్, ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల నాయకులు హీరాలాల్, రవికుమార్, మోహన్‌రావు, జీవన్‌కుమార్, సాంబమూర్తి, కిశోర్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరఫున మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.