Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయవంతానికి పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా పిలుపు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అనేక హామీలు ఇచ్చినా ఏ ఒక్కటీ నెరవేర్చని కేంద్రప్రభుత్వ చర్యలను నిరసిస్తూ శనివారం జిల్లావ్యాప్తంగా సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ చేపట్టే ఆందోళనలను విజయవంతం చేయాల్సిందిగా ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
తెలంగాణకు వివిధ సందర్భాల్లో చేసిన వాగ్దానాలు, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన హక్కులు, వాటాలను కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తూ, నిర్లక్ష్యం చేస్తోందని తెలిపారు. వివక్షను ప్రదర్శిస్తూ, తీవ్ర అన్యాయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. సింగరేణి లాంటి సంస్థలను పూర్తిగా ప్రయివేటీకరించడానికి పూనుకుంటున్నదని ఆరో పించారు. తాజాగా సింగరేణిలో మరోసారి బొగ్గు గనుల వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నదని, కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రైయివేటు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నదని పేర్కొన్నారు. బయ్యారం ఉక్కు, గిరిజన, హర్టికల్చర్ యూనివర్సిటీలు, ఎన్టీపిసి విద్యుత్ కేంద్రం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తడంలేదని వివరించారు. యూపీఏ హయాంలో మంజూరైన ఐటిఐఆర్ రద్దు చేసిందని, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 8న తెలంగాణ రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తితంగా నిరసనలు తెలియజేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ నిలుపునిచ్చిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో శనివారం అన్ని మండల/ పట్టణ కేంద్రాల్లో నిరసనలను విజయవంతం చేయాల్సిందిగా కోరారు.