Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్మ మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటు
- సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కాసాని, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే.రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
కార్మిక సమస్యలపై సమరశీల పోరాటమే పద్మకి ఇచ్చే ఘనమైన నివాళి అని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే.రమేష్ అన్నారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు వద్ది పద్మ సంతాప సభ రామవరం, మేషన్ కాలనీ పద్మ ఇంటి వద్ద పార్టీ పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు అధ్యక్షతన జరిగింది. ముందుగా పద్మ చిత్ర పటానికి కాసాని, ఏజే.రమేష్‌లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మిక సమస్యలపై జరిగిన పోరాటాల్లో వద్ది పద్మ చురుకైన పాత్ర పోషించిందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ యూనియన్ ఏర్పాటు చేయడంలో కామ్రేడ్ పద్మ కీలక పాత్ర పోషించారన్నారు. యూనియన్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా కార్మికుల సమస్యలపై జరిగిన ప్రతి పోరాటంలో పద్మ పాల్గొన్నదని తెలిపారు. రూ.400లు ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కార్మికుల జీతాలు రూ.12 వేల వరకు పోరాడి సాధించిన విజయంలో పద్మ పాత్ర ప్రధానమైనదని అన్నారు. కార్మికులను సమస్యలపై సమీకరించే భాధ్యత పద్మ ఎపుడూ తానే చూసేదనీ, తనకు తెలిసిన జ్ఞానంతో కార్మికుల హక్కుల కోసం పోరాటం తప్ప వేరే మార్గం లేదంటూ వారిని చైతన్య పరుస్తూ పోరాటాల్లో తీసుకువచ్చే కృషి చేసిందన్నారు. తాను నమ్మిన ఎర్రజెండాను తుది శ్వాస వరకు విడవకుండా నిజాయితీ కలిగిన కమ్యునిస్టుగా పద్మ తన జీవితాన్ని కొనసాగించిందని నివాళి అర్పించారు. పద్మ మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటన్నారు. కేవలం హాస్పిటల్లో కార్మికుల జీతాల కోసం జరిగే పోరాటమే కాకుండా పేదలు కోసం ఇళ్ల స్థలాల పోరాటం, ఇతర కార్మికులు చేసిన పోరాటాల్లో కూడా తాను ప్రత్యక్ష భాగస్వామ్యం అయ్యేదని కార్మికుల పోరాటంలో తను సంఘీభావంగా పాల్గొనేదిదని గుర్తుచేశారు. యూనియన్ను ఐక్యంగా నడిపించడంలో పద్మ కీలక పాత్ర పోషించిందని, అనేక ప్రలోభాలు కల్పించిన ఒత్తిళ్లకు గురిచేసిన బెదరకుండా యూనియన్ విచ్ఛిన్నం కాకుండా కాపాడిన ఘనత పద్మకే దక్కుతుందని నేతలు కొనియాడారు. తను ఏమి చదువక పోయినా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చు కున్నదని, ఈ పద్దతి అధికారులు, కాంట్రాక్టర్ల మెడలు వంచడానికి ఉపయోగించిందన్నారు. కార్మిక పోరాటాలకు పద్మ లేని లోటు తీరనిదని, కార్మికుల సమస్యలపై సమ రశీల పోరాటమే పద్మకి ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. పద్మ కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, పట్టణ కమిటీ సభ్యులు సందకూరి లక్ష్మి, నందిపాటి రమేష్, భాస్కర్, ఆది, శివారెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.