Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బికెఎంయు జిల్లా జిల్లా నేతలు రేసు ఎల్లయ్య, యార్లగడ్డ భాస్కర్ రావు
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
వ్యవసాయరంగ కార్మికుల సమగ్ర సంక్షేమ చట్టం అమలుకోసం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మూడు ఎకరాల భూ పంపిణీకోసం వ్యవసాయరంగ కార్మికులు ఉద్యమ బాట పట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం (బికెఎంయు) భద్రాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యార్లగడ్డ భాస్కర్ రావు, అధ్యక్షులు రేసు ఎల్లయ్య పిలుపు నిచ్చారు. బికెఎంయు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా ఎల్లయ్య మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు, పేదలకు ఇచ్చిన హామీలు ఏండ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. బికెఎంయు దేశవ్యాప్తంగా చేసిన పోరాటాల ఫలితంగానే గ్రామీణ ఉపాదిహామీ పథకం, అటవీ హక్కుల చట్టం సాధించుకున్నామని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. అనాదిగా గిరిజనులు, గిరిజనేతర పేదలు సాగుచేసుకుంటున్న పోడు రైతులపై ప్రభుత్వం కక్ష కట్టిందని, 2005 అటవీహక్కుల చట్టం ప్రకారం పోడు సాగుదారులకు పట్టాలు మంజూరు చేయాల్సిన ప్రభుత్వం పేదల సాగులో ఉన్న భూములను లాక్కుంటూ బతుకు లాగేసుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు వీసంశెట్టి పూర్ణచందర్ రావు, వాగబోయిన రమేష్, వజ్జ పగడయ్య, ఇమ్మానియేలు, కత్తుల నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.