Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 ఏండ్లుగా నివాసం ఉంటున్న పేదలకు నోటీసులు
- బాధితులకు అండగా సీపీఐ(ఎం)
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాచలం శివారులోని రాజుపేట కాలనీలో 30 ఏండ్లుగా నివాసం ఉంటున్న 40 నిరుపేద కుటుంబాల నివాస గృహాలకు ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దేవస్థానం భూములలో అక్రమంగా నివాసం ఉంటున్నారన్న పేరుతో పేదలను ఖాళీ చేసే కుట్రకు ప్రభుత్వ పెద్దలు పూనుకుంటున్నారు. నోటీసులు జారీ చేసి పేదల గుండెల్లో అలజడిని సృష్టిస్తున్నారు.
వివరాలుకెళ్తే భద్రాచలం పట్టణానికి అనుకొని ఉన్న రాజుపేట కాలనీ సగం ప్రాంతం పోలవరం ముంపు పేరుతో పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలోని భూములు ఆంధ్రాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అట్టి భూములలో గత 30 ఏళ్లుగా నివాస గృహాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న పేదలకు కోర్టు ఉత్తర్వుల పేరుతో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రెవిన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి నెల 15 రోజుల్లో ఖాళీ చేసి ఆ భూభాగాని ప్రభుత్వానికి అప్పజెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. 30 ఏళ్లుగా ఇంటి పన్నులు చెల్లిస్తూ విద్యుత్తు బకాయిలు చెల్లిస్తూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పేదలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఇప్పుడు ఖాళీ చేపిస్తే మా పరిస్థితి ఏంటి అని సంబంధిత బాధితులు వాపోతున్నారు. ఇక్కడ నివాసం ఉండే 40 కుటుంబాలు కూడా ఎస్సీ, ఎస్టీ బీసీ వెనకబడ్డ తరగతులకు చెందిన రోజువారి కూలీలు కావటం చేత ప్రభుత్వం చేసే ఈ చర్యల వల్ల దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఎటపాక పురుషోత్తపట్నం పంచాయతీలలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీతో సహా అందరూ అధికార పార్టీ వైయస్సార్ సీపీ వారే అయినా బాధితులు అండగా వారు నిలబడక పోవటంతో బాధితులు సీపీఐ(ఎం) పార్టీని ఆశ్రయించారు.
బాధితులకు అండగా సీపీఐ(ఎం)
నిరుపేదలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయాన్ని తెలుసుకున్న భద్రాచలం సీపీఐ(ఎం) నియోజవర్గ కమిటీ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎట్టపాక సీపీఐ(ఎం) మండల కమిటీల బృందం బాధితుల వద్దకు వెళ్లి విషయం అడిగి తెలుసుకుని వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ ఎట్టపాక మండల కార్యదర్శి ఈసంపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలపై ప్రభుత్వం అధికారులు చేసే కుట్రను మానుకోవాలని హెచ్చరించారు. ఇదే భూభాగంలో ఇల్లు నిర్మించుకున్న పేదలకు ఇంటి పనులు ఇచ్చింది ప్రభుత్వ అధికారులు కాదా అదే ఇంటిపై రేషన్ కార్డులు మంజూరు చేసి కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించి ఇప్పుడు ఖాళీ చేయమంటే వాళ్ళు ఎక్కడికి పోతారని ప్రశ్నించారు. వందల ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటే పట్టించుకోని అధికా రులు పేదలు నివాసముంటున్న భూములను గుంజుకో వాలని చూడటం సరైనది కాదని, అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. బాధితులకు అండగా సీపీఐ(ఎం) తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ కమిటీలు ఎల్లప్పుడూ ఉంటాయని బాధితులకు భరో సాను కల్పించారు. బాధితులను పరామర్శించిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.వి నర్సారెడ్డి, భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యు లు వై.వెంకట రామారావు, సంతోష్ కుమార్, లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు డి.సీతామాలక్ష్మి, ఎటపాక పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు రాము తదితరులు పాల్గొన్నారు.