Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లిక్కి బాలరాజు
నవతెలంగాణ-కొత్తగూడెం
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్ స్పందించాలని, హైదరాబాద్‌లో జరిగే విద్యార్థి, నిరుద్యోగ మహాదీక్షను జయప్రదం చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లిక్కి బాలరాజు అన్నారు. సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని టీచర్స్ భవన్లో (యూటిఎఫ్) టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థి, నిరుద్యోగ జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సెమినార్‌కు ఎస్ఎఫ్ఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి మంద నాగకృష్ణ అధ్యక్షత వహించారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లిక్కి బాలరాజు ప్రధాన వక్తగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత జీవితాల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. టీఎస్ పీఎస్సీ ఏఈ, గ్రూప్-1 పేపర్లు లీకై రాష్ట్రంలో విద్యార్థి, నిరోద్యోగ యువత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనౌతుంటే వారికి భరోసా కల్పించేందుకు కేసీఆర్ కనీసం స్పందించరా...? అని అడిగారు. టీఎస్ పీఎస్సీలో 30 లక్షల మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వీరందరిలో ఈ పేపర్ లీకేజీతో చదివితే ఉద్యోగం వస్తుందో...!, రాదోనన్న...! అభద్రతాభావం ఏర్పడిందన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోనే 450 పై చిలుకు ఉద్యోగాలు అవసరం ఉంటే కేవలం 80 ఉద్యోగాలతో కాలం వెళ్ళదీస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతాయనీ ముఖ్యమంత్రి స్పందించే వరకూ తమ పోరాటం ఆపబోమన్నారు. పేపర్ లీకేజీపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లీకేజీ వలన నష్టపోయిన ప్రతీ నిరుద్యోగ యువతకు ప్రతీ నెలకు రూ.20,000లు ఇవ్వాలనీ, రాష్ట్రంలో ప్రతీ యేటా ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించి నియామకాలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. వరుస పోటీ పరీక్షల, పదవ తరగతి పేపర్ లీకేజీలలో రాజకీయ కుట్ర కోణంలోనూ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ఎస్వీకే, సుందరయ్య పార్క్ వద్ద పేపర్ లీకేజీ నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ మహాదీక్ష చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థి, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం, ఎస్ఎఫ్ఐ కొత్తగూడెం డివిజన్ అధ్యక్షులు బోడ అభిమిత్ర, జిల్లా కమిటీ సభ్యులు జమ్మి యశ్వంత్, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.