Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో బూర్గంపాడు పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు. బూర్గంపాడు ఎస్సై పి.సంతోష్ తన సిబ్బందితో కలిసి సోమవారం అర్ధరాత్రి అంజనాపురం గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. స్థానిక దర్గా వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూసిన ఆ ఇద్దరు అక్కడి నుండి పరారయ్యారు. ఆ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా పోలీసులకు పేలుడుకు సంబంధించిన సామగ్రి లభ్యమైంది. 148 ఐరన్ పైపులు, రేడియో, వీహెచ్ఎఫ్ సెట్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సమాచారాన్ని పాల్వంచ సీఐ ఎం.నాగరాజుకు ఎస్సైపి.సంతోష్ తెలిపారు. దీంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకుని సామాగ్రిని పరిశీలించారు. పేలుడు పదార్ధాలకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని ఎస్సై సంతోష్ పేర్కొన్నారు.