Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ స్టేషన్లో దళిత సంఘాల ఫిర్యాదు
నవతెలంగాణ-మణుగూరు
సమితి సింగారం గ్రామా పంచాయతీ ఎదురుగా ఉన్నటువంటి బీఆర్ అంబేద్కర్ విగ్రహం స్థలములో అక్రమంగా ముత్యాలమ్మ గుడి నిర్మాణము ఆపకపోతే ఘర్షణ జరిగే అవకాశం ఉన్నదని దళిత సంఘాలు తెలిపాయి. మంగళవారం మణుగూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చామన్నారు. అనంతరం తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో వీరబాబు, ఎంపీవో పల్నాటి వెంకటేశ్వర్లు తదితర అధికారులకు దరఖాస్తులు అందజేశామన్నారు. నాయకులు మాట్లాడుతూ విగ్రహం గతంలో అంబేద్కర్ సెంటర్ ఉండేది. రోడ్డు విస్తరణలో భాగంగా విగ్రహాన్ని తొలిగించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నం చేయగా సంఘం నాయకులు, రాజకీయ పార్టీల అఖిల పక్షం ఆధ్వర్యంలో అడ్డుకోవడం జరిగింద న్నారు. ప్రభుత్వ అధికారులు దళిత సంఘం నాయకులతో, రాజకీయ పార్టీల అఖిల పక్షం నాయకులతో చర్చలు జరిపారు. దాని ఫలితంగా అధికారులు అంబేద్కర్ సెంటర్లో ఉన్నటువంటి పాత అంబేద్కర్ విగ్రహాన్ని సమితి సింగారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఉన్న పార్కులో విగ్రహ నిర్మాణం చేయుటకు అంగీకరిం చడం జరిగిందన్నారు. విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు రోడ్డు విస్తరణలో భాగంగా అక్కడి నుండి ఆనాటి మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్, తహసీల్దార్, ఏఈ రమేష్, సీఐలు 2021 ఆగష్టు నెల 8న అంబేద్కర్ విగ్రహాన్ని సమితిసింగారం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఉన్న పార్కులో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఈ నెల 9వ తేదీన సమితిసింగారం గ్రామా ప్రజలు అంబేద్కర్ విగ్రహ స్థలంలో ముత్యాలమ్మగుడి నిర్మాణం చేపట్టుటకు పనులు ప్రారంభించారన్నారు. ఉద్ధేశ్యపూర్వకంగా ఆ స్థలంలో ముత్యాలమ్మగుడి నిర్మాణం చేయడం వలన ఘర్షణలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. కావున తమరు పరిశీలించి డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ స్థలంలో ముత్యాలమ్మ గుడి నిర్మాణాన్ని ఆపాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు నైనారపు నాగేశ్వరరావు, పప్పుల మణిబాబు, సిద్దల తిరుమలరావు, నల్లగట్ల రవి, పాక వెంకటేశ్వర్లు, మల్లికార్జున్, శ్రీను కుమార్ తదితరులు పాల్గొన్నారు.