Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరింతలు కొడుతూ విద్యార్థుల సంబురం
- ఊపిరి తీసుకున్న అధికారులు.. ఉపాధ్యాయులు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి తీసుకున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల పేపర్ లీకేజీల వార్తల నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్కరూ పరీక్ష కేంద్రంలోకి మొబైల్ తీసుకు పోకుండా చర్యలు చేపట్టారు. చివరకు పరీక్ష కేంద్రాల తనిఖీకి వచ్చిన కలెక్టర్ సైతం తనిఖీ చేశాకే లోనికి వెళ్లారు. ఈనెల 3వ తేదీన మొదలైన పరీక్షలు మంగళవారం ముగియడంతో విద్యార్థులు సంబురం చేసుకున్నారు. చివరి పరీక్ష ముగియగానే కేరింతల మధ్య కాగితాలు చించి వెదజల్లుతూ ఇళ్ళు, స్కూల్స్ కు చేరారు. కొన్ని పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు ఫేర్ వల్ డేలు సైతం ఏర్పాటు చేశారు.
40 - 70 మంది వరకూ గైర్హాజరు
మొత్తం ఈ పరీక్షలకు 16,873 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా సగటున 40 నుంచి 70 మంది వరకు విద్యార్థులు గైర్హాజరయ్యారు. చివరి పరీక్ష సోషల్ కు 47 మంది విద్యార్థులు హాజరుకాలేదు. మిగిలిన 16826 మంది విద్యార్థులు 103 కేంద్రాల్లో పరీక్ష రాశారు. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మూడు పరీక్ష కేంద్రాలను, జిల్లా స్థాయి పరిశీలుకుల బృందం (05) పరీక్ష కేంద్రాలు, జిల్లా విద్యా శాఖాధికారి 3 పరీక్ష కేంద్రాలు, ప్రభుత్వ సహాయ కమిషనర్ మూడు సెంటర్ల చొప్పున తనిఖీ చేశారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ గౌతమ్
పదో తరగతి పరీక్షల నిర్వహణ సరళిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నగరంలోని మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీ వివేకానంద విద్యానికేతన్ లలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కనీస మౌళిక సదుపాయాల కల్పన, ప్రహారీ గోడ భద్రత అంశాలను ఆయన పరిశీలించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చీఫ్ సూపరింటెండెంట్ తో సహా ఇన్విజిలేటర్లు, పరీక్షా నిర్వహణ విధులకు కేటాయించిన ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి, లోనికి అనుమతించాలని, సెల్ ఫోన్ ను అనుమతించకూడదని కలెక్టర్ భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ప్రహారీ గోడ సరిగా లేనిచోట భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ప్రత్యేక అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి కోలాహలం నాగరాజు, ఇతర అధికారులు ఉన్నారు.