Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం
- సండ్ర, నామ, బండి, వద్దిరాజు, తాతా, కూరాకుల
- సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
- పొంగులేటి వ్యాఖ్యలపై సభలో నిప్పులు చెరిగిన నేతలు
నవతెలంగాణ-సత్తుపల్లి
తెలంగాణ రాకముందు, వచ్చాక జరిగిన అభివృద్ధి ముఖచిత్రాన్ని కరపత్రాల్లో ముద్రించి ధైర్యంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. మంగళవారం సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభ స్థానిక తుమ్మూరు రామారావు వీధిలోని మైదానంలో సండ్ర అధ్యక్షతన జరిగింది. ఈ సమ్మేళన సభకు ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, డీసీసీబీ ఛైర్మెన్ కూరాకుల నాగభూషణం అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు దాటనీయనంటూ పొంగులేటా అహంభావంతో వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవర్ని గెలిపించాలో ప్రజలే తీర్పు ఇస్తారని, పొంగులేటి కాదని నామ అన్నారు. ప్రజాక్షేత్రంలో ఎవరి సత్తా ఏంటో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో అహంకారులకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. అసెంబ్లీ ఎవడబ్బ సొత్తుకాదని, అసెంబ్లీ గేటును తాకనీయనని పొంగులేటి చేసిన రాజకీయ అజ్ఞానపు ప్రేలాపనలు చెల్లవన్నారు. ఆయనకు రాజకీయ జెండా కాని, ఎజెండా కాని లేదన్నారు. నలుగురు నాయకులను వెంటేసుకొని తిప్పి వాళ్లను రాజకీయ బలిపశువులుగా మార్చడం తప్ప పొంగులేటి వల్ల ఏమీ కాదన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి మాట్లాడుతూ ఇంతకు ముందు కాలంలో పలానా వాళ్లు మన పార్టీ వాళ్లేనా అని గుర్తించి ప్రభుత్వ పరంగా పథకాలు అందించే వారని, ఇప్పుడా పరిస్థితి చూద్దామన్నా కనపడకుండా పోయిందన్నారు. సమాజంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఫలాలను అందిస్తోంద న్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర నేతృత్వంలో అభివృద్ధి జరిగిందని, ఇకపై ఆగదని, నిరంతరాయంగా ముందుకు సాగుతుందన్నారు. పుష్కలంగా డబ్బుందనే తలబిరుసుతో నోటికి పట్టని విధంగా బీఆర్ఎస్పై, అధినేత కేసీఆర్ను విమర్శించడం తగదని పొంగులేటిపై ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్య విరుచుకుపడ్డారు. డబ్బు మదాన్ని, తలబిరుసును అణిచేశక్తి ప్రజలకే ఉందన్నారు. ప్రజల దయాదాక్షిణ్యాలపైనే ఎమ్మెల్యేను అయ్యానని, ప్రజలతోనే తన ప్రయాణమని సండ్ర స్పష్టం చేశారు. అతిత్వరలో పొంగులేటి రాజకీయ జీవితం భూస్థాపితం అవ్వడం ఖాయమన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయను మొర్రో అంటే వినకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు మాయమాటలు చెప్పి, ఖర్చంతా భరిస్తానని నమ్మబలికి, ఖమ్మం అసెంబ్లీ స్థానంకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేయించి ఆగమాగం చేశాడని ఖమ్మం డీసీసీబీ ఛైర్మెన్ కూరాకుల నాగభూషణం టంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు నమ్మినందుకు ఖమ్మం మెయిన్రోడ్డును ఆనుకుని ఉన్న తన 5100 గజాల స్థలం కోల్పోయానన్నారు. ఆ స్థలం విలువ ప్రస్తుతం సుమారు రూ.20 కోట్ల దాకా ఉంటుందన్నారు. ఆయనతో ఉన్న తన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఎవరూ తనలా నష్టపోవొద్దని హితవు పలికారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మెన్ శేషగిరిరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ ఛైర్మెన్ వనమా శ్రీనివాసుదేవరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ దొడ్డా హైమవతి శంకరరావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, 23 వార్డులకు చెందిన కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.