Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొంగులేటిది జన రాజకీయం కాదు ధన రాజకీయం
- ఎంపీగా ఉన్నప్పుడు ఏరోజైనా పార్లమెంటులో ఓ ప్రశ్న అడిగావా..?
- నీలాంటి ఆర్థిక ఉన్మాదుల చేతిలో జిల్లాను బంధీ కానీయం
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు
- అభివద్ధిపై నీ మార్క్ ఏదీ? : సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'నీలాంటి 100 మంది వచ్చినా బీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరు.. నిన్ను రాజకీయ సమాధి చేయడమే బీఆర్ఎస్ లక్ష్యం' అని బీఆర్ఎస్ బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యాఖ్యానించారు. కెసిఆర్‌తో కలిసి ముద్ద తిన్నప్పుడు, ఆయన కొడుకు కేటీఆర్‌తో సహవాసం చేసినప్పుడు వారు రావణాసురులు అనే విషయం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. పొంగులేటి జన రాజకీయం చేయకుండా ధన రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పొంగులేటి వంటి ఆర్థిక ఉన్మాదుల చేతిలో జిల్లాను బంధీకానీయమని ప్రతిజ్ఞ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగులేటికి కౌంటర్ ఇచ్చారు. పొంగులేటి ఏ పార్టీకి పోతే ఆ పార్టీ ఖతమే అన్నారు. ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనీయను అనే పొంగులేటి వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇది నీ అహంకారపూరిత వైఖరికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. నీ అభ్యర్థులుగా చెప్పుకునే తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, లింగాల కమల్ రాజ్, మదన్‌లాల్‌లను 2018 ఎన్నికల్లో నువ్వేమైనా గెలిపించావా? అని ప్రశ్నించారు. విజేతలను నిర్ణయించేది ఓటర్లే కానీ పొంగులేటి కాదన్నారు. పాత్రికేయులపై లేని ప్రేమను ఒలకపోసిన నువ్వు పార్టీలో ఉండగా ఏరోజైనా ఇళ్ల స్థలాల గురించి సీఎంను అడిగావా? అని ప్రశ్నించారు. ఎస్ఆర్ గార్డెన్ వెనుక ఉన్న నీ భూములను రెగ్యులరైజ్ చేసుకున్నవు తప్ప.. జర్నలిస్టుల గురించి అడిగింది లేదన్నారు. పొంగులేటి అపరిచితుడు.. ఆర్థిక ప్రయోజనాల కోసమే ఆయన బీఆర్ఎస్లో చేరాడే తప్ప, ఏ రోజూ ఆయన పార్టీకి చేసింది ఏమీ లేదన్నారు. నీలా మాట్లాడిన ఎందరో కేసీఆర్ ముందు కాలగర్భంలో కలిసిపోయారని.. నిన్ను రాజకీయ సమాధి చేయడమే బీఆర్ఎస్ లక్ష్యం అని ప్రతిన పూనారు. నీ అనుయాయులు ఎవరికీ సముచిత ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నావు.. ఇస్తే ముక్కు నేలకు రాస్తావా? అని నిలదీశారు. భద్రాద్రి జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, రాష్ట్ర బొర్రా రాజశేఖర్, ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, సూతగాని జైపాల్.. వీరంతా ఎవరని ప్రశ్నించారు. నిన్ను నమ్మిన వాళ్ల రాజకీయ జీవితాన్ని ఖతం చేసేదే నువ్వు.. 2016లో సుచరిత రెడ్డి గొంతు కోసింది నువ్వు కాదా? 2018లో పార్టీలో ఉండి తుమ్మల, మదన్ లాల్, జలగం వెంకట్రావు ఓటమి కోసం పని చేయలేదా? ఆరు నెలలకే కేసీఆర్ ఏంటో నీకు అర్థం అయినప్పుడు.. పార్టీలో ఎందుకు ఉన్నావు? నీ వర్క్ లు, నీ రాజకీయ జీవితం, మీ ఆర్థిక లాభాల కోసం ఉన్నావంటూ పొంగులేటికి మధు కౌంటర్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లోనూ నీ సొంత బలంతో గెలవలేదు.. వైయస్సార్ చరిష్మా, కాంగ్రెస్ పోటీ చేయకపోవడం, సిపిఎం మద్దతు ఇవ్వడం కలిసి వచ్చిందన్నారు.పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బు అహంకారంతో తప్ప ప్రజా విశ్వాసంతో మాట్లాడటం లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఆర్థిక వనరుల ముద్ర తప్ప.. ఎంపీగా జిల్లాపై నీ ముద్ర ఏదీ అని ప్రశ్నించారు. కెసిఆర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని పొంగులేటినుద్దేశించి ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు వ్యాఖ్యానించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా తాను బరిలో ఉన్నానని, సిపిఎం మద్దతుతో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పొంగులేటి పోటీ చేశారని, ఆ ఎన్నికల్లో మధిర నియోజక వర్గంలో తనకు 53 వేల ఓట్లు వస్తే 68 వేల ఓట్లు నీకు ఎలా వచ్చాయని, సిపిఎం నీకు సహకరించినా నువ్వు మాత్రం ఆ పార్టీకి సహకరించలేదని వివరించారు. సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, కార్పొరేటర్ కమర్తపు మురళి, నాయకులు డోకుపర్తి సుబ్బారావు, రమణ తదితరులు పాల్గొన్నారు.