Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేళ సీపీఐ(ఎం) భద్రాచలం ఒక చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఎదురవుతున్న సవాళ్లు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు, వివిధ సంఘాల బాధ్యులు భారీ ఎత్తున హాజరయ్యారు. భారత రాజ్యాంగం గొప్పతనం, అంబేద్కర్ చేసిన సేవలు గురించి అనేకమంది వక్తలు తమ తమ అభిప్రాయాలను ఘంటాపదంగా వెల్లడించారు. అంబేద్కర్ ఔన్నత్యంపై సీపీఐ(ఎం) రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మరోసారి మననం చేసుకునే అవకాశాన్ని కల్పించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి భారీ స్పందన లభించింది.
- ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న బీజేపీ
- అ సీపీఐ(ఎం) రౌండ్ టేబుల్ సమావేశం పలువురు వక్తలు
నవతెలంగాణ-భద్రాచలం
భారత లౌకిక, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని దానిని కాపాడు కోవడం పౌరులందరి బాధ్యతని, అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాల సందర్భంగా భద్రాచలంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ''భారత రాజ్యాంగం-ప్రజాస్వామ్యం-ఎదురవుతున్నసవాళ్లు'' అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గురువారం జరిగింది. ఈ సమావేశమునకు సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్, భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోట్ల దేవదానం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నదని విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు పోవడం ప్రతి ఒక్క పౌరుడు పై ఉన్నదని వారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని, లౌకిక, ప్రజాస్వామ్యం, ఆర్థికస్వాలంబన, సామాజిక న్యాయం, ఫెడరలిజం వంటి రాజ్యాంగ మౌలిక స్వరూపాలకు పెనుముప్పు పొంచి ఉన్నదని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకోవడం అంటే తిరోగమన విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమేనని అన్నారు. ప్రస్తుతం దేశంలో కార్పోరేట్, సామ్రాజ్యవాద పరిస్థితులు రాజ్యమేలుతున్నాయని అందుకు బీజేపీ గుత్త సంస్థలకు అనుకూలంగా ఆర్థిక విధానాలు నిర్ణయించడం కారణం అన్నారు. సామాజిక న్యాయం అందని ద్రాక్షగా ఉన్నదని విమర్శించారు. బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అండదండలతో పాలన సాగుతుందని అన్నారు. బీజేపీ కార్పొరేట్, గుత్త సంస్థలకు భారత ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మటానికి నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని అన్నారు.
భారత రాజ్యాంగానికి బదులు బీజేపీ మనువాదాన్ని అమలు జరపాలని చూస్తున్నదని అన్నారు. భారత సమాజంలో మనువాదాన్ని అమలు జరపడం అంటే పాతకాలపు ఫ్యూడల్ భావజాలాన్ని ముందుకు తీసుకురావటమేనని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి పురోగామి శక్తులు, అభ్యుదయ సంస్థలు ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం ప్రజలందరి బాధ్యత అన్నారు. భారత సమాజంలో కులం, మతం, ప్రాంతం అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయని అన్నారు. అభ్యుదయ శక్తులు ఐక్యంగా పోరాటం ద్వారా అంబేద్కర్ ఆశించిన ఫలాలను సాధించవచ్చునని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అరికెళ్ల తిరుపతిరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సరేళ్ళ నరేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కుంచాల రాజారాం, ఎంఎస్పీ పార్టీ నాయకులు అలవాల రాజా, గిరిజన సామాజిక సంఘాల నాయకులు పూనం వీరభద్రం, పూణెం కృష్ణ, టీఎన్జీవో జిల్లా నాయకులు చల్లగుల్ల నాగేశ్వరరావు, పట్టణ ప్రముఖులు సీనియర్ సీపీఐ(ఎం) నాయకులు జిఎస్ శంకర్రావు, పట్టణ పౌరుసమితి నాయకులు తాళ్లపూడి రాము, గ్రీన్ భద్రాద్రి గౌరవ అధ్యక్షులు పల్లంటి దేశప్ప, కొండరెడ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముర్ల రమేష్, తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్, దళిత సంక్షేమ సంఘం వ్యవసాయ వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పాల్‌రాజ్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, అంబోజీ రత్నం, గిరిజన సంఘం పట్టణ కార్యదర్శి కుంజా శ్రీనివాస్, మైనారిటీ నాయకులు మునాఫ్, సలీం, సిఐటియు నాయకులు ఎం.రేణుక, ఎం.నాగరాజు, లక్ష్మన్న, పార్టీపట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వై.వెంకట రామారావు, పి.సంతోష్ కుమార్, ఐద్వా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు యు.జ్యోతి, డి.సీతాలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు లీలావతి, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజన్ ఉపాధ్యక్షులు ప్రతాప్, ఆర్టీసీ జిల్లా నాయకులు రాజేశ్వరరావు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బిబిజి తిలక్, ఎమ్మార్పీఎస్ నాయకులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు, ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు పట్టణ పౌరులు ఎన్జీవో సంస్థలు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.